జగన్ యాత్ర వల్ల ఒరిగిందేమిటి?

కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వద్దని అంటున్నా, పార్టీ అధిష్టానం నివారించినా, అంకుల్ కెవిపి రామచందర్ రావు సలహా ఇచ్చినా వినకుండా జగన్ ఓదార్పు యాత్రను చేపట్టేందుకే నిర్ణయించుకున్నారు. దానివల్ల వరంగల్ జిల్లాలో అనవసరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమే కాకుండా తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రజాప్రతినిధుల అంగరక్షకుల కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు వార్తలు వస్తుండగా ఒక వ్యక్తి మాత్రమే మరణించినట్లు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అయితే, ఎవరూ చనిపోలేదని వరంగల్ జిల్లా ఎస్పీ అంటున్నారు. అవన్నీ వదంతులేనని ఆయన చెబుతున్నారు.
మాట వినకుండా ధిక్కరించడానికే తాను నిర్ణయించుకున్నట్లు జగన్ తన యాత్ర ద్వారా అధిష్టానానికి హెచ్చరిక చేయదలుచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు పార్టీని ఆయన రాష్ట్రంలో చీల్చదలుచుకున్నారా అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. జగన్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. షోకాజ్ నోటీసు ఇస్తే జగన్ ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. జగన్ ను వదులుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్దంగా ఉందా అనేది కూడా తేలడం లేదు. మొత్తం మీద, ఒక స్పష్టమైన ఆలోచనతోనే, తన భవిష్యత్తు కార్యక్రమ రూపకల్పనకే జగన్ ఈ యాత్రను మొండిగా చేపట్టినట్లు భావించవచ్చు.












Click it and Unblock the Notifications