కెసిఆర్ తో చేతులు కలిపిన కాంగ్రెసు తెలంగాణ నేత కెకె?

K Keshav Rao
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుతో కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావు చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సాధన కోసమే కాకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఈ ఇరువురు నేతల మధ్య రహస్య అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. తెలంగాణ సాధన తమ ఇరువురి వల్ల సాధ్యమైందినే వాతావరణాన్ని సృష్టించాలని వారి ఇద్దరి ఆలోచనగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల ఉద్యమానికి కేశవరావు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు పార్టీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం సలహా మేరకే తెలంగాణ ప్రాంత పార్టీ నాయకులతో ఆయన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కెసిఆర్ తో స్నేహానికి సిద్ధపడినట్లు సమాచారం.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే లోగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తగిన ప్రాతిపదిక ఏర్పాటు చేయాలనేది కెసిఆర్, కెకెల ఉమ్మడి వ్యూహంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా కెసిఆర్ నవంబర్ నెలలో ఢిల్లీ కొన్నాళ్ల పాటు మకాం వేసేందుకు ప్రణాళిక తయారైనట్లు చెబుతున్నారు. కెసిఆర్ నవంబర్ లో కాంగ్రెసు అధిష్టాన వర్గానికి చెందిన నాయకులను విస్తృతంగా కలుసుకుని మంతనాలు జరిపే అవకాశం ఉంది. ఇందుకు కేశవరావు అపాయింట్ మెంట్ల వంటి వ్యవహారాలను చూస్తున్నట్లు వినికిడి. తెలంగాణలో కాంగ్రెసుతో కలిసి పనిచేయడానికి కెసిఆర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కెసిఆర్ టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసును మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు.

కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేయాలా, వద్దా అనే డైలమాలో కెసిఆర్ ఉన్నప్పటికీ కాంగ్రెసుతో కలిసి పనిచేయడానికి మాత్రం అభ్యంతరం లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహరచనను అమలు చేయడానికి కేశవ రావు కేంద్రంలో మంత్రి పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు మంత్రి పదవి తీసుకుంటే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+