సిఎం ఎంపిక బాధ్యతను సోనియాకు అప్పగిస్తూ సిఎల్పీ తీర్మానం

నాయకత్వ మార్పిడికే ఈ సమావేశం ఏర్పాటు చేశామని, మిగతా విషయాలేమీ చర్చించవద్దని డిఎస్ సమావేశంలో కోరారు. తనకు సహకరించిన శాసనసభ్యులకు రోశయ్య కృతజ్ఞతలు తెలిపారు. రోశయ్యకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని డిఎస్ సమావేశంలో ప్రతిపాదించారు. ఆ తర్వాత సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. అన్ని రకాల ఆలోచనలు చేసే నాయకుడిని పార్టీ అధిష్టానం ఇస్తుందని రోశయ్య సమావేశంలో అన్నారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే పార్టీ బలహీనపడుతామని ఆయన అన్నారు. కొత్త నేత ఎంపిక కోసమే తాము ఇక్కడికి వచ్చామని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. వైయస్సార్ సేవలను ఆయన కొనియాడారు. ఆర్థిక నిర్వహణలో రోశయ్య తీరు భేష్ అని ఆయన అన్నారు.
సమావేశానికి ముందు ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన అధిష్టానం ప్రతినిధులు ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్, ఎకె ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా సిఎల్పీ సమావేశానికి వచ్చారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గాన్ని అదుపు చేసేందుకు కెవిపి రామచందర్ రావును ప్రత్యేకంగా సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. అంతకు ముందు కెవిపి రామచందర్ రావు, షబ్బీర్ అలీ, మంత్రి దానం నాగేందర్ విడిగా సమావేశమయ్యారు. అధిష్టానం అభీష్టాన్ని కెవిపి వారికి వివరించినట్లు సమాచారం. సిఎల్పీ కొత్త నేతగా వైయస్ జగన్ పేరును ప్రతిపాదిస్తామని ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి సమావేశానికి ముందు చెప్పారు. వైయస్ జగన్ కే ఎక్కువ మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ఆయన చెప్పారు.
ఏ విధమైన గొడవ జరగకుండా సిఎల్పీ సమావేశం ముగిసింది. సమావేశం కొద్ది నిమిషాల్లోనే ముగిసింది. సమావేశంలో ఎవరూ మాట్లాడలేదని తెలుస్తోంది. కొండా సురేఖ ఉద్దేశ్యపూర్వకంగానే సమావేశానికి హాజరు కాలేదని సమాచారం.












Click it and Unblock the Notifications