బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి కష్టాలు: వైయస్ జగన్ అస్త్రాలు

రైతు ఆత్మహత్యలు ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో జరుగుతూ వచ్చాయి. తీవ్రమైన కరవుకు నష్టపోయి రైతులు పెద్ద యెత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ, కొత్తగా కోస్తా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 40, 50 మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమో, గుండెపోటుతో మరణించడమో జరిగింది. వీటిని నివారించే స్థితిలో ప్రభుత్వం లేదు. వ్యవసాయ శాఖ మంత్రిగా వైయస్ వివేకానంద రెడ్డి ఏమీ చేయలేని స్థితి ఉంది. తన సోదరుడు వైయస్సార్ కలలు నిజం చేయడానికే తాను వ్యవసాయ శాఖను తీసుకున్నట్లు వైయస్ వివేకానంద రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ రైతుల పరిస్థితి మెరుగు పరిచే స్థితి అటుండగా, ఆత్మహత్యలు నిత్యం జరుగుతున్నాయి.
రైతు ఆత్మహత్యలపై వైయస్ జగన్ సాక్షి మీడియా తీవ్రంగా తప్పుపడుతోంది. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తోంది. సాక్షి దినపత్రికలో రైతు కష్టాలపై సవివరమైన వార్తాకథనాలను ప్రచురిస్తోంది. సాక్షి చానెల్ లో ప్రసారం చేస్తోంది. ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నా పరోక్షంగా అది వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న వైయస్ వివేకానంద రెడ్డి మీద బాణాలు ఎక్కుపెట్టినట్లే. ఆ రైతు సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్ జగన్ రేపు విజయవాడలో 48 గంటల పాటు దీక్ష ప్రారంభిస్తున్నారు. ఈ దీక్ష ఏ మేరకు ప్రభుత్వాన్ని కదిలిస్తుందనే దానికన్నా వైయస్ వివేకానంద రెడ్డి ఎలా ప్రతిస్పందిస్తారనే దానిపైనే ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications