పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డి, జగన్ వర్గంలో భయాలు

వివేకానందరెడ్డికి పులివెందుల నియోజకవర్గంలో అందరితో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలతోనూ వివేకాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు కీలకమైన వ్యవసాయశాఖ మంత్రిగా ఉండటంతో నియోజవర్గంలో మరింతగా దూసుకుపోతున్నారు. రచ్చబండ కార్యక్రమంతో ఆయన ప్రధానంగా పులివెందులపైనే దృష్టిపెడుతున్నారు. కొందరు నేతలు రహస్యంగా వివేకాకు మద్దతిస్తుంటే మరికొందరు బహిరంగంగానే ఆయన వెంట నిలుస్తున్నారు. దివంగత నేత భార్యపై బరిలో దిగుతున్నారు కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తూ ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. వివేకా వ్యూహంతో వైయస్ జగన్ వర్గంలో గుబులు చోటు చేసుకుంది.
పులివెందుల నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న తెదేపా నుంచి కొందరు నేతలను కాంగ్రెస్‌లోకి రప్పించే ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో చక్రాయపేట మండలం పులివెందుల పరిధిలోకి వచ్చింది. ఆ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలైన తండ్రీతనయులు ఆర్.రాజగోపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డిలను తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు తుది దశలో ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే భారీ మెజారిటీ కడప లోక్‌సభలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి కలిసొస్తుంది. ఈసారి తమకూ అదే వాతావరణం ఉంటుందని తొలుత జగన్ శిబిరం ఆశించింది. వివేకా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో బాగా పట్టు సాధిస్తుండడంతో ఆ ఆశలు వమ్మవుతాయనే భయం పట్టుకుంది.
వివేకా అసెంబ్లీకి పోటీచేస్తే కడప ఆయన కుటుంబ సభ్యులనే కడప పార్లమెంటు సీటును పోటీకి దించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా వివేకా తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని లోక్‌సభకు ప్రతిపాదిస్తున్నారు. ఈయన పులివెందులకు చెందిన నేతే. వివేకా లోక్‌సభకు పోటీచేసి, అసెంబ్లీకి ఆయన భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులను పోటీకి దింపాలనే ప్రతిపాదనను ఇప్పటికీ కొందరు ప్రతిపాదిస్తున్నారు. పులివెందులను గెల్చుకోవడంతోపాటు కడప లోక్‌సభలో జగన్‌ను నిలువరించడమూ అంతే ముఖ్యం కాబట్టి ఆ విధంగా వ్యూహం ఉండాలనేది వీరి వాదన. వివేకాతోపాటు మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, తులసిరెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితర నేతలతో సీఎం తన ఎత్తుగడలపై తరచుగా సంభాషిస్తున్నారు.












Click it and Unblock the Notifications