పక్కనే భర్త శవం.. కొడుకు రక్తపు మడుగులో.. కానీ ఆ లేడీ డాక్టర్ బెడ్‌పై ఏం చేస్తోందంటే?
కర్ణాటకలోని ధార్వాడ్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో భర్త గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉండగా.. 8 ఏళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఆ గదిలోనే ఉన్న ఆ పిల్లాడి తల్లి తనకేమీ పట్టనట్లు బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తూ ఉండడం కర్ణాటకలో సంచలనం సృష్టించింది. ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన బంధువులు ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు.
ఈ ఘటనలో మృతుడిని 45 ఏళ్ల అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ హోనన్నవర్‌గా పోలీసులు గుర్తించారు. డాక్టర్ కిరణ్ గొంతుపై కత్తిపోట్లతో బెడ్ రూమ్ నేలపై విగతజీవిగా పడి ఉన్నాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న 8 ఏళ్ల కుమారుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిందనే అనుమానంతో కిరణ్ భార్య, కంటి డాక్టర్ అయిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం నుంచి డాక్టర్ కిరణ్ ఫోన్ కలవకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ప్రియాంకకు ఫోన్ చేయగా.. ఆమె ఒక్కోసారి ఒక్కో తీరుగా పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంంతో అనుమానం వచ్చిన బంధువులు వారి ఇంటికి చేరుకున్నారు. తలుపులు లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో వారు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌కు కట్టుదిట్టమైన భద్రత ఉందని.. ప్రాథమిక దర్యాప్తులో బయటి వ్యక్తులెవరూ లోపలికి వచ్చినట్లు ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనా సమయంలో ఇంట్లో భార్యాభర్తలు, వారి కుమారుడు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. ఓ గదిలో కిరణ్ బోర్లా పడి ఉండగా.. మరో గదిలో కొడుకు రక్తపు మడుగులు పడి ఉన్నాడు. అదే గదిలో ప్రియాంక ఏ మాత్రం చలనం లేకుండా ఫోన్ చూస్తూ గడుపుతుండడం వీడియోల ద్వారా తేలిపోయింది.
అయితే ప్రస్తుతం ప్రియాంక షాక్ లో ఉందని.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తోందని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణం వెనుక కుటుంబ కలహాలే కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దంపతులు కుమారుడికి ఆటిజం ఉన్నట్లు తెలిసింది. ఈ ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.














Click it and Unblock the Notifications