అడ్డొస్తే ఒమన్ ను బాంబులతో పేల్చేస్తాం.. ట్రంప్ సంచలన వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందం విషయంలో ఒమన్ జోక్యం చేసుకుంటే ఆ దేశంపై మిలిటరీ యాక్షన్ ను ప్రారంభిస్తామని హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి విషయంలో ఒమన్- ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ మండిపడ్డారు. అలాగే ఇరాన్ మొత్తం అమెరికాకు సరెండర్ కావాలని స్పష్టం చేశారు.
" ఒకవేళ ఒమన్ మా మధ్యలో వస్తే.. మేము ఆ దేశంపై దాడులు జరిపి ఆ చెత్తను తొలగిస్తాం" అని తాజగా ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధి వేదికగా మేరిటైమ్ కో ఆపరేషన్ పై ఒమన్- ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం జరుగుతున్న క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే విషయంపై ఇరాన్ విదేశాంగ శాఖ మాట్లాడుతూ.. ఒమన్ తో జాయింట్ డిక్లరేషన్ చేసుకుంటున్నట్లు ధ్రువీకరించింది.
అయితే ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 28 నుంచి హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. హార్మూజ్ జలసంధిని మూసివేయడం.. తెరవడం.. ఆంక్షలు విధించడం చేస్తోంది. మరోవైపు ట్రంప్ మాత్రం హార్మూజ్ జలసంధి అమెరికా కంట్రోల్ లో ఉందని చెబుతున్నారు. తాజాగా మరో అడుగు ముందుకువేసి ట్రంప్ కీలక స్టేట్ మెంట్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధి అమెరికా భూభాగంలోనే ఉందని అన్నారు. దాంతో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ వెంటనే బదులిచ్చింది. హర్మూజ్ ఇరాన్ ఆధీనంలోనే ఉందని తెలిపింది.

ఇక తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తక్షణమే సరెండర్ కావాలని.. తెల్ల జెండాను ప్రదర్శించాలని అన్నారు. ఓవైపు అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు వస్తున్న క్రమంలో ఇరాన్ తో యుద్ధం ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి ప్రస్తుతం మధ్య ప్రాచ్య ఘర్షణల్లో అత్యంత కీలకమైన ఉద్రిక్తత కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు రవాణాకు ఈ జలమార్గం అత్యంత కీలకం కావడంతో ఇరాన్, అమెరికా మధ్య వివాదంలో హార్మూజ్ అంశం ప్రధానంగా మారింది.












Click it and Unblock the Notifications