ఉన్నపళంగా ఎయిర్‌టెల్ లో సునీల్ భారతీ మిట్టల్ రీప్లేస్మెంట్.. !!
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అగ్ర నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సునీల్ భారతీ మిట్టల్ ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో షబ్నమ్ సిన్హా నూతన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆమె ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదానికి అనుగుణంగా అక్టోబర్ 1 నుంచి ఈ నియామకం అమలులోకి రానుంది.
సునీల్ మిట్టల్ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీతో బ్యాంక్ బోర్డు నుంచి వైదొలగనున్నారు. దీంతో 2016 ఏప్రిల్ నుంచి సుదీర్ఘంగా సాగిన ఆయన పదేళ్ల పదవీ కాలం ముగియనుంది. అక్టోబర్ 1న ఈ స్థానంలో షబ్నమ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. చైర్‌పర్సన్‌గా మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆమె సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకింగ్ సేవలను మరింత వేగంగా విస్తరిస్తుందని సంస్థ ఆశిస్తోంది.

షబ్నమ్ సిన్హాకు డెవలప్‌మెంట్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పబ్లిక్ పాలసీ, ఇన్‌స్టిట్యూషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆమె ప్రపంచ బ్యాంకులో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లోని ప్రభుత్వాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలకు గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ పై సలహాదారుగా వ్యవహరించారు. అనేక మెరుగైన ఫలితాలను సాధించారు.
ప్రస్తుతం ఆమె ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నియమించిన ఓ టెక్నికల్ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. దీతో పాటు రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ కమిటీలలో కూడా ఆమె క్రియాశీల సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఉన్న ఈ విస్తృత అనుభవం బ్యాంక్ భవిష్యత్తు కార్యకలాపాలకు, సైబర్ సెక్యూరిటీ పరంగా తీసుకోబోయే భద్రతా చర్యలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చెబుతోంది.
సునీల్ మిట్టల్ నేతృత్వంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతీయ డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రస్తుతం వార్షిక ఆదాయ పరంగా దేశంలోనే అతిపెద్ద పేమెంట్స్ బ్యాంక్‌గా ఇది గుర్తింపు పొందింది. ఈ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 12.1 కోట్లకు పైగా మంత్లీ యాక్టివ్ యూజర్లు, దాదాపు మూడు కోట్ల మంది సేవింగ్స్ ఖాతాదారులు ఉన్నారు. దేశంలోని ప్రతి నాలుగు గ్రామాలలో మూడింటికి ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ నెట్‌వర్క్‌ను అందుబాటులో ఉంటోంది.













Click it and Unblock the Notifications