Cabinet Reshuffle: మోడీ కేబినెట్ విస్తరణ ఖరారు..! కేంద్రమంత్రి హింట్..! గోయల్ అవుట్?
బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఇవాళ కీలక మార్పులు జరిగాయి. ఊహించని విధంగా పలువురు నేతలకు ఇందులో స్ధానం దక్కింది. మరికొందరిపై వేటు పడింది. స్మృతీ ఇరానీ తిరిగి రావడం, రాం మాధవ్ కూ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు కీలక బాధ్యతలు దక్కడం జరిగాయి. అలాగే ఐటీ సెల్ ఛీఫ్ అమిత్ మాలవీయపై వేటు పడింది. ఇలా చాలా మార్పులే జరిగాయి. వీటి అనంతరం ఇక మిగిలింది కేంద్ర కేబినెట్ ప్రక్షాళన (Cabinet reshuffle). ఇప్పటికే ఈ దిశగా పలు అడుగులు పడినా పార్లమెంట్ సమావేశాల కారణంగా ముందడుగు పడలేదు. దీంతో త్వరలో కేబినెట్ మార్పులు, చేర్పులకు ప్రధాని మోడీ సిద్దమవుతున్నారు.
ప్రధాని మోదీ తన మూడవ విడత ప్రభుత్వంలో త్వరలోనే జరగబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ సంస్థాగత మార్పుల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వంలోనూ మార్పులు తథ్యమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన పలు రాజకీయ పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ బాధ్యతలను వదులుకోవడంతో ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో రవ్‌నీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, పలువురు కేంద్ర సహాయ మంత్రులకు పార్టీ సంస్థాగత బాధ్యతలు ఇవ్వడం కూడా క్యాబినెట్ మార్పుల సంకేతాలను స్పష్టం చేస్తోంది.

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే జరుగుతుందని ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన ఆర్‌పీఐ (ఎ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే వెల్లడించారు. ఈ మార్పుల్లో ఎన్డీయే మిత్రపక్షాలకు, ముఖ్యంగా ఎన్సీపీకి కూడా చోటు దక్కే అవకాశం ఉందని ఆయన తెలిపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్టాల్లో యువ నాయకత్వానికి ఈసారి కేబినెట్‌లో ప్రాధాన్యం దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇవాళ పార్టీ ట్రెజరర్ గా నియమితులైన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు ఉద్వాసన తప్పేలా లేదు. గతంలో జేపీ నడ్డా తరహాలో ఒక వ్యక్తికి రెండు పదవుల ఫార్ములా అమలు చేస్తే మాత్రం గోయల్ సేఫ్. అలాగే త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుంచి ఎక్కువ మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications