Visakhapatnam-LTT express: విశాఖ-ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ రూటు, టైమింగ్స్ మార్పు ?
విశాఖపట్నం నుంచి గోదావరి, కృష్ణా జిల్లాల మీదుగా ముంబైకి వెళ్లే విశాఖ-లోక్ మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ ప్రెస్ (Visakhapatnam-LTT express) రాకపోకల్లో త్వరలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఈ కీలకమైన రైలు రూటుతో పాటు రైలు బయలుదేరే సమయాల్లోనూ భారీ మార్పులు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీనిపై ప్రయాణికుల నుంచి అప్పుడే అభ్యంతరాలు కూడా మొదలయ్యాయి.
ప్రస్తుతం విశాఖపట్న నుంచి ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 11.20కు బయలుదేరుతుంది. ఇది విజయవాడ, వరంగల్, హైదరాబాద్ మీదుగా ముంబై లోక్ మాన్య తిలక్ టెర్మినస్ కు వెళ్తుంది. దీని ప్రయాణ సమయం 28 గంటలు. ఈ లెక్కన రెండో రోజు ఉదయం 4.48కి ఇది ముంబై ఎల్టీటీకి చేరుతుంది. ఏపీ నుంచి ముంబైకి వెళ్లే వ్యాపారులు, ఇతర వర్గాల వారికీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ రైలుకూ మంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ రైలు విశాఖలో బయలుదేరే సమయాన్ని రాత్రి 11.20కు బదులుగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలోకి తీసుకురావాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అదే జరిగితే ముంబైకి రెండో రోజు వెళ్లే సరికి మధ్యాహ్నం అయిపోతుంది. అప్పుడు ఏపీ ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

అలాగే విశాఖ-ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ రైలును విజయవాడ, వరంగల్ మీదుగా కాకుండా గుంటూరు, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ మార్గంలోకి మార్చాలని కూడా రైల్వే అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీని వల్ల కూడా ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రూటు మార్పు వల్ల ప్రయాణ సమయం కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖలో 80 శాతం సీట్లు నింపుకుంటున్న ఈ రైలు రూటు మార్పు వల్ల ఎక్కే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని అంచనా. దీంతో ఈ రైలు రూటు మార్చవద్దని, టైమింగ్స్ కూడా మార్చవద్దని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దానికి బదులుగా కొత్త రైలును ఈ మార్గంలో, ఈ టైమింగ్స్ తో నడపాలని సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications
