జెపిపై దాడికి తెరాస ఎమ్మెల్యేలపై మంత్రులు ఫైర్, బ్లాక్ డేగా అభివర్ణన

గవర్నర్ పట్ల, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణలపై దాడిని హేయమైన చర్య అని మంత్రి జానారెడ్డి అన్నారు. వారి చర్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న ప్రతినిధులు ఇలా వ్యవహరించడం సరికాదని, దీనిని ప్రజలు హర్షించరని చెప్పారు. వారి తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినేలా ఉందని చెప్పారు. వారు ప్రవర్తనపై వారే ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా ప్రవర్తించవద్దన్నారు. ఇకముందు వారు ఇలాంటి చర్యలకు పూనుకోకూడదని సూచించారు. ఇలాగే ఇకముందు వ్యవహరిస్తే ప్రజలకు నష్టం చేస్తుందన్నారు. రాజ్యాంగ విరుద్ద తీరును ప్రజలు ఆమోదించరని వారు తెలుసుకోవాలని సూచించారు. జెపిపై దాడిని ముక్తకంఠంతో ప్రజలందరూ ఖండించాలని చెప్పారు. శాసనసభ గౌరవాన్ని అందరూ గౌరవించాలని కోరారు.
గవర్నర్ ప్రసంగాన్ని కనీసం వినకుండానే అడ్డుకోవడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నరు. మీడియా పాయింట్ వద్ద జెపిపై దాడి చేయడం చూస్తుంటే ప్రజాస్వామ్యం దారితప్పి పయనిస్తుందని అర్థమవుతుందన్నారు. ఇలాంటి దుర్ఘటన గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. టిడిపి, టిఆర్ఎస్ నేతలు తాము చేసిన పనికి ఇప్పటికైనా పశ్చాత్తాపపడాల్సి ఉందన్నారు. ఈరోజు చేసిన పనికి దేశ ప్రజల దృష్టిలో చులకన అయ్యామని, సిగ్గుపడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.












Click it and Unblock the Notifications