బెడిసి కొట్టిన సీట్ల సర్దుబాటు: యూపిఎకి కష్టాలు, డిఎంకె కటీఫ్

సీట్ల పంపకం విభేదాలు చివరికి కాంగ్రెస్ డీఎంకేల ఏడేళ్ల స్నేహానికి గండికొట్టాయి. సీట్ల పంపకం పేరుతో విభేదాలు బయటకు వచ్చినప్పటికీ ఇరు పార్టీల మధ్య అంతకుముంచిన విభేదాలే ఉన్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి రాజా విషయంలో కూడా మొదట విభేదాలు వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలగాలని, ఇక నుంచి అంశాల వారీగా మాత్రమే మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయిస్తూ డీఎంకే అత్యున్నత స్థాయి కమిటీ శనివారం సాయంత్రం ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది.
కాంగ్రెస్ పార్టీకి పొత్తులో భాగంగా డీఎంకే 60 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ కాంగ్రెస్ 63 సీట్లను డిమాండు చేయటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు కాంగ్రెస్‌కు 40 కాస్త అటూ ఇటూ కంటే ఎక్కువగా ఇవ్వవద్దు అన్న ఉద్దేశ్యంతోనే డిఎంకే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ నిర్ణయంతో తమిళనాడులోని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. అయితే ఇది తమకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తోంది.
2జి కుంభకోణం పాపానికి కేవలం డిఎంకెను బలి చేయడానికి, ఆ పార్టీకి చెందిన కలైంజర్ టీవీ కార్యాలయాలపై సీబీఐ దాడులు చేయడం,కరుణానిధి కుమార్తె, ఎంపీ.. కనిమొళిని 2జీ కుంభకోణంలోకి లాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం వంటి కేంద్రం, కాంగ్రెస్ పార్టీ చర్యలు రెండు పార్టీల మధ్యా అగాధాన్ని సృష్టించింది. సీట్ల పంపకం విషయానికంటే ప్రభుత్వం ఏమవుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్‌ను ఎక్కువగా కలవరపరుస్తోందని సమాచారం.
అయితే డీఎంకే నిర్ణయం కారణంగా కాంగ్రెస్ తమిళనాట ఎన్నికలకు ఒంటరిగా వెళుతుందా లేదా అన్నది ఇపుడు ముఖ్యం కాదు. ఒకవేళ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సమయం లేదు. అంతకుమించి ఏ పార్టీలూ అందుకు సిద్ధంగా లేవు. అన్నాడీఎంకే వామపక్షాలతోనూ, విజయకాంత్ పార్టీ డీఎండీకేతోనూ ఇప్పటికే పొత్తుపెట్టుకుంది. యూపీఏ-2 పడవను డీఎంకే ముంచుతుందా లేదా అన్నదే అందరి ముందూ ఉన్న ప్రశ్న.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు కానీ బలాబలాల్లో అనూహ్యంగా మార్పులు జరిగితే ఏమైనా జరగొచ్చు. డీఎంకే బయటకు వెళ్లిపోవడం ద్వారా యూపిఎకి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదమేమి లేదు. బయటి నుండి వచ్చే మద్దతుతో కలిపి యూపిఏకి 311 మెజారిటీ ఉంది. డిఎంకె బయటకు వెళ్లి పోయినా వచ్చే సమస్యేమీ లేదు.