ఏపీలో ముంచెత్తబోతున్న వానలు.. కుండపోతే
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఒకవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతుండగా.. మరోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) అమరావతి కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..నైరుతి రుతుపవనాల పయనం ప్రస్తుతం మరింత విస్తరించింది. ఈ నెపథ్యంలోనే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాక
వాయువ్య బంగాళాఖాతంతో పాటు పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఇవి విస్తరించాయి. జూన్ 12 నాటికి ఈ రుతుపవనాలు హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం గుండా ప్రయాణిస్తూ దేశంలో ముందుకు సాగుతున్నాయి. వీటికి తోడు ఉత్తర కోస్తా తమిళనాడుపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం పరిస్థితి
ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షంతో పాటు తీవ్రమైన వేడి, తేమ వల్ల వాతావరణం అసౌకర్యంగా మారనుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. రేపు (ఆదివారం) కొన్ని చోట్ల, ఎల్లుండి (సోమవారం) ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చు. ఈ మూడు రోజులూ బలమైన ఈదురు గాలులు కొనసాగుతాయి.
దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం
దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఈరోజు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉక్కపోత, వేడి, తేమ ఎక్కువగా ఉండి ప్రజలకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. రేపు, ఎల్లుండి వర్షాల తీవ్రత కాస్త తగ్గి.. ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే, రాబోయే మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, మెరుపుల ఉధృతి మాత్రం అలాగే ఉంటుందని అధికారులు తెలిపారు.
రాయలసీమలో వాతావరణ సూచన
రాయలసీమ ప్రాంతంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు ఒక మోస్తరుగా మాత్రమే ఉండనున్నాయి. ఈరోజు సీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉండగా.. రేపు, ఎల్లుండి కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షాలు పడవచ్చు. అయితే, వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ రాయలసీమ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపుల ప్రభావం బలంగా ఉంటుంది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు సూచించారు














Click it and Unblock the Notifications