గ్లోబల్-500 బ్రాండ్స్ జాబితా... టాప్-50లో టాటా గ్రూప్

గతేడాది 108 ర్యాంకును చేజిక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఇప్పుడు 133 స్థానానికి పడిపోయింది. బ్రాండ్ విలువ 6.99 బిలియన్ డాలర్లకు తగ్గింది. కాగా, భారత్ నుంచి తాజా జాబితాలో మొత్తం 9 కంపెనీలకు చోటు లభించింది. ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్‌ల ర్యాంకులు ఈ ఏడాది దిగజారగా... ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), భారతీ ఎయిర్‌టెల్, విప్రో కంపెనీలు గ్లోబల్-500లో కొత్తగా చోటు దక్కించుకున్నాయి.
ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో ఇంటర్నెట్ సెర్చి ఇంజన్ దిగ్గజం గూగుల్ 44.29 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో నంబర్ 1 బ్రాండ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది టాప్‌లో నిలిచిన వాల్-మార్ట్ మూడో ర్యాంకుకు తగ్గింది. మైక్రోసాఫ్ట్ మాత్రం నం.5 నుంచి నం.2 ర్యాంకుకు ఎగబాకింది. దీని బ్రాండ్ విలువ 42.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐబీఎం 4, వొడాఫోన్ 5వ ర్యాంకులలో నిలిచాయి. గతేడాది జాబితాలో 20వ స్థానంలో ఉన్న యాపిల్ ఎనిమిదో స్థానానికి దూసుకెళ్లింది.
తొలిసారి టాప్-10 నుంచి కోక-కోలా నిష్ర్కమించడం గమనార్హం. గతేడాది ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం పొందిన కోక-కోలా ఈసారి 16వ ర్యాంక్‌కు పడిపోయింది. ఈ కంపెనీ బ్రాండ్ విలువ 9 బిలియన్ డాలర్లు క్షీణించి 25.8 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక పేర్కొంది. టాప్-10 బ్రాండ్‌లలో 5 కంపెనీలు టెక్నాలజీ రంగానికి చెందినవే కావడం విశేషం.