కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖరారు

ఇప్పటి వరకు కాంగ్రెసు అభ్యర్థులుగా పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డి, కడప లోకసభ సీటు నుంచి ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పోటీ చేస్తారని అనుకుంటూ వస్తున్నారు. అయితే, వదిన విజయమ్మ మీద పోటీ చేయడానికి వైయస్ వివేకానంద రెడ్డి విముఖత ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, వివేకానంద రెడ్డి మాత్రం ఆ విధమైన యోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఏమైనా మార్పు చేయదలిస్తే అధిష్టానం చేయాల్సిందే. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి తన నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఒక రకంగా కడప జిల్లాలో ఆధిపత్యం కోసం పోరాటం చేయాల్సిన అనివార్యతలో వివేకానంద రెడ్డి పడ్డారు. వైయస్ జగన్‌పై ఆధిక్యత సాధించడం ఆయన తక్షణ లక్ష్యంగా కనిపిస్తోంది. అందువల్ల హోరాహోరీ పోరుకే ఆయన సిద్ధపడవచ్చు.
కాగా, వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి విడిపోయి సొంత పార్టీ కింద బరిలోకి దిగుతుండడంతో కాంగ్రెసు ఓట్లు చీలిపోతాయని, దాని నుంచి లబ్ధి పొందాలని, అందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. వైయస్ జగన్‌ను ఈ ఉప ఎన్నికల్లో దెబ్బ తీస్తే, క్రమంగా కడప జిల్లాలో ఆధిపత్య సమీకరణల్లో మార్పులు వస్తాయని ఆయన అనుకుంటున్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల అభ్యర్థులను ఓడించడానికి, కడప జిల్లాలో పట్టు సాధించడానికి ఇంత కన్నా మంచి అవకాశం రాదని ఆయన భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉప ఎన్నికల సమరం హోరాహోరీ సాగనుంది.












Click it and Unblock the Notifications