హైదరాబాద్: కడప, పులివెందుల ఉపఎన్నికల నేపథ్యంలో మే 8న జరగాల్సిన ఎంసెట్ రెండు వారాలకు వాయిదాపడింది. మే 22న ఎంసెట్‌ను నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది. ఎన్నికల సంఘం సలహాను అనుసరించి అనివార్య పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఉపఎన్నికల తేదీలు బుధవారం వెలువడటంతో గురువారం మధ్యాహ్నం ఎంసెట్ కన్వీనర్ రమణారావు, కో-కన్వీనర్ విశ్వనాథ్ సచివాలయంలో ఎన్నికల అధికారులతో చర్చించారు. ఇదే విషయమై ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు జయప్రకాశ్‌రావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌తో మాట్లాడినప్పుడు ఎంసెట్ తేదీని వాయిదా వేయడం మంచిదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎంసెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది.
అనంతరం జయప్రకాశ్‌రావు విలేకర్లతో మాట్లాడుతూ ఎంసెట్ వాయిదాను ప్రకటించారు. కడపలో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను 6715 మంది, మెడికల్ పరీక్షను 1510 మంది విద్యార్థులు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మే 8న కడప ఉపఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల లెక్కింపు 13న ఉంటుందని.. దీనివల్ల ఎంసెట్‌ను మే 15న నిర్వహించాలన్నా ప్రశ్నపత్రాల భద్రత, ఇతర ఏర్పాట్లకు అవరోధాలు కలుగుతాయన్నారు. అదీగాక మే 15న క్లాట్, నిమ్‌సెట్ తదితర ప్రవేశపరీక్షలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కారణాల వల్లే పరీక్షను మే 22న జరపాలని నిర్ణయించామని, జూన్ మొదటి వారంలో మార్కులు వెల్లడించి నెలాఖరుకు ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షను ఆదివారం రోజే నిర్వహించాలని నిర్ణయించామని, నిరుడు కూడా ఆదివారమే జరిపామని గుర్తు చేశారు.