రసకందాయంలో బెజవాడ టిడిపి: జగన్ పార్టీలోకి వల్లభనేని, టిడిపిలోకి నెహ్రూ?

దేవినేని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంపై వల్లభనేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవినేని విజయవాడలో తన వంశీయులే ఏలాలనే ఉద్దేశ్యంతో ఉన్నారన్నారు. ఆయన జిల్లాలో ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకుంటున్నారని ఇది సరైనది కాదన్నారు. వల్లభనేని వ్యాఖ్యలతో జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడినవి. గత కొంతకాలంగా దేవినేని జిల్లాలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో దేవినేని పట్టును కట్టడి చేయాలనే వ్యూహంలో భాగంగా వల్లభనేని హరికృష్ణ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
కాగా వల్లభనేని జగన్ వర్గంలోకి వెళుతున్నారనే ప్రచారం ఒకవైపు జరుగుతుండగా కాంగ్రెసు ఎమ్మెల్యే దేవినేని నెహ్రూను టిడిపిలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు దేవినేని ఉమ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నెహ్రూను టిడిపిలోకి తీసుకు వచ్చి జిల్లాలో ఇప్పటికే ఉన్న ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే యోచనలో ఉమ ఉన్నట్లుగా తెలుస్తోంది. బంధుత్వం పేరుతో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెసుతో ఉమ సత్సంబంధాలు కొనసాగించడమే కాకుండా, నెహ్రూను కాంగ్రెసులోకి తీసుకు వస్తారనే వాదనలు రావడంతో వల్లభనేని జగన్ వర్గంలో చేరాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కృష్ణా జిల్లాలో కాంగ్రెసు నుండి దేవినేని నెహ్రూ, టిడిపి నుండి ఉమ పట్టు సాధిస్తున్నారు. వారి ఆధిపత్యానికి చెక్ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా వల్లభనేని, కొడాలి నానితో కలిసి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో వారి ఆధిపత్యాన్ని తగ్గించడానికి జగన్ వర్గంలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని వల్లభనేని వర్గం ఖండిస్తోంది. ఎన్టీఆర్‌కు, తెలుగుదేశానికి అభిమానులం అయిన తాము జగన్‌తో వెళ్లే అవకాశాలు లేవని అంటోంది. టిడిపిలో ఇక్కడ వర్గ విభేదాలు ఉన్నాయని, అయితే వేరే మార్పి మారే ఉద్దేశ్యం లేదని చెబుతోంది.