అవిశ్వాసంపై చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్లనున్న టిఆర్ఎస్, సిపిఐ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ఉప్పు - నిప్పులా ఉన్న తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నాయి. రైతు సమస్యలపై అధికార కాంగ్రెసు ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అవిశ్వాసానికి తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని తేల్చి చెప్పాయి. అయితే అవిశ్వాసంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సిపిఎం తెలిపింది. తెలంగాణ వ్యతిరేకి అయిన కాంగ్రెసు పార్టీని రాష్ట్రంలో కూల్చడానికి తాము ఎవరితోనైనా కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ తెలిపారు. సమైక్య రాష్ట్ర శాసనసభ సాక్షిగా తెలంగాణ హక్కులు హరించుకు పోతున్నాయని అన్నారు. తాము కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే టిడిపి అవిశ్వాసానికి మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు.
టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వాగతించారు. సోంపేట, కాకరాపల్లి ఘటనలను ప్రధానంగా తీసుకుంటామని చెప్పారు. అవిశ్వాసం ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా ఉందన్నారు. అవిశ్వాసంతో ఎవరు ఎటున్నారో తేలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిందే అన్నారు. దానికి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందన్నారు.