Weather Forecast: ఏపీలో రేపు అటు ఎండలు-ఇటు వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్ లో మిశ్రమ వాతావరణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల ఎండలు మండిపోగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రేపు కూడా దాదాపు ఇలాంటి వాతావరణమే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా (weather forecast) వేసింది. ఎల్ నినో పరిస్ధితుల కారణంగా ఇలా మిశ్రమ వాతావరణ పరిస్ధితులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
రేపు (04-05-26) రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పార్వతీపురం, సీతానగరం,వీరఘట్టం మండలాలు, పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాలు, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, గుంటూరు జిల్లాలోని మంగళగిరి, మెడికొండూరు, ఫిరంగిపురం, తాడికొండ, తాడేపల్లి, తుళ్లూరు మండలాలు, పల్నాడు జిల్లాలోని అమరావతి, పెదకూరపాడు మండలాలు, నెల్లూరు జిల్లాలో మనుబోలు, గూడూరు మండలాల్లో వడగాలులు ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

మరోవైపు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు విస్తరించిన ద్రోణి కారణంగా సోమవారం (04-05-26) అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, పోలవరం,విశాఖ, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications