హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అనుచరుడు సూరీడు మళ్లీ కనిపించాడు. సంవత్సరంన్నర క్రితం వైయస్ దుర్మరణం అనంతరం అనూహ్యంగా తెర వెనక్కి వెళ్లిన సూరీడు శనివారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకార ఉత్సవం సమయంలో కనిపించారు. సంవత్సరంన్నరగా సూరీడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చాడు. పిసిసి బాధ్యతలు చేపట్టడానికి బొత్స సత్యనారాయణ ఆయన ఇంటి వద్ద నుండి బయలు దేరాడు.
బొత్స భారీ ర్యాలీతో గాంధీ భవన్ వచ్చాడు. అయితే బొత్స ఉన్న వాహనంలోనే సూరీడు ర్యాలీలో పాల్గొన్నాడు. బొత్స వెనుకే నిల్చున్నాడు. ఆ తర్వాత గాంధీభవన్ వచ్చిన తర్వాత బొత్స వేదిక పైకి వెళుతున్న సమయంలో కూడా వేదిక పైకి వెళుతూ కనిపించాడు. అయితే చాలాకాలం తర్వాత సూరీడు కనిపించడంతో కాంగ్రెసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. గతంలో వైయస్‌కు తోడుగా నీడగా ఉన్న సూరీడు ఇప్పుడు బొత్సకు కూడా కుడిభుజంలా ఉంటాడేమోననే గుసగుసలు వినిపిస్తున్నాయి.