హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పత్వాలు జారీ చేస్తే తాము చూస్తూ కూర్చోమని మంత్రి దానం నాగేందర్ మంగళవారం అన్నారు. కెసిఆర్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ముడుపుల కోసమే మెట్రోను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ముడుపులు ముట్టాయని చెప్పిన కెసిఆర్ నిరాధార వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ముడుపులు అందాయని చెప్పడం బాధ్యతారాహిత్యం అన్నారు.
ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత కెసిఆర్‌కు లేదన్నారు. తాము ముఖ్యమంత్రి తొత్తులమని కానీ ఎల్ అండ్ టి తొత్తులం మాత్రోం కాదన్నారు. మెట్రో ప్రాజెక్టుపై టిఆర్ఎస్‌కు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అఖిలపక్షంలో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రిని కలిసి అభిప్రాయాలు చెప్పాలన్నారు. వారు చెప్పిన అభిప్రాయాలు సాంకేతికంగా సరియైనవని తేలినప్పుడు ముఖ్యమంత్రి వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే ప్రశ్నించవచ్చునన్నారు.