జగన్ వైయస్ చావునూ రాజకీయం చేస్తున్నాడు: బొత్స

వాతావరణం సరిగా లేదు, హెలికాప్టర్‌లో వెళ్లొద్దని తాను పదే పదే వైయస్సార్‌ను కోరానని, తాను కనీసం వైయస్‌కు ఫోన్లైనా చేసి ఉంటానని ఆయన అన్నారు. వైయస్ మరణంపై సాక్షిలో అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తాకథనం ప్రచురించినప్పుడు ఈ విషయాన్ని కూడా విచారణ పరిధిలో చేర్చాలని తాను అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను కోరుతూ లేఖ రాశానని, ఆ మేరకు దాన్ని కూడా విచారణ పరిధిలో చేర్చారని, కావాలంటే ఆ లేఖను చూసుకోవచ్చునని ఆయన అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన విమర్శలను తాను సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. లగడపాటి రాజగోపాల్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన ఖండించారు.
తెలంగాణ సమస్యపై సంప్రదింపులు జరుగుతున్నాయని, రాష్ట్రస్థాయిలో ఓ పరిష్కారం కనుక్కోవడానికి తాను, ముఖ్యమంత్రి ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఈ సమస్యపై తమ పార్టీలో ఏకాభిప్రాయానికి తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సమస్య ఒక్క రోజులో పరిష్కారమయ్యేది కాదని ఆయన అన్నారు. అయితే, ఏళ్లూ యుగాలూ తీసుకోవాలని లేదని, సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. డీజిల్ ధర పెరిగినందు వల్లనే ఆర్టీసి బస్సు చార్జీలు పెంచామని ఆయన చెప్పారు. ఆర్టీసికి 700 కోట్ల రూపాయలు లోటున్నా 500 కోట్ల రూపాయల మేరకే చార్జీలు పెంచామని ఆయన చెప్పారు.