బర్న్ట్ గార్లిక్ జీరా రైస్ ఇలా చేశారంటే ప్లేట్లు ఖాళీ అవ్వడం ఖాయం!
ప్రతిరోజూ ఇంట్లో వండే సాధారణ జీరా రైస్ తిని బోర్ కొట్టిందా? లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా, అదే సమయంలో రెస్టారెంట్ స్టైల్ రుచితో ఏదైనా స్పెషల్ వంటకం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన ఫ్లేవర్డ్ రైస్ రెసిపీ ఉంది. అదే "స్మోకీ ఫ్లేవర్ గార్లిక్ జీరా రైస్".
స్మోకీ ఫ్లేవర్ గార్లిక్ జీరా రైస్
సాధారణంగా చేసుకునే జీరా రైస్‌కు వెల్లుల్లిని, కొద్దిగా స్మోకీ ఫ్లేవర్‌ను జోడించి చేసే ఈ వంటకం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. కేవలం ఐదు నుండి ఆరు నిమిషాలలో సిద్ధమయ్యే ఈ టేస్టీ రైస్ రెసిపీ తయారీ విధానం మరియు దానికి కావాల్సిన పదార్థాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 1 కప్పు (గంటసేపు నానబెట్టినవి)
జీలకర్ర - 1 లేదా 2 టీస్పూన్లు
వెల్లుల్లి తరుగు - 4 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)
నూనె - 2 టీస్పూన్లు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - 1 ఇంచ్ ముక్క
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 2 (చిన్న ముక్కలు)
మిరియాల పొడి - అర టీస్పూన్
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తగినంత ఉప్పు వేసి ఎసరులో వండుకోవాలి. అన్నం 90 శాతం ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌లో వేసి చల్లార్చాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ లో నూనె మరియు నెయ్యి కలిపి వేడి చేయాలి. నూనె కాగాక అందులో దాల్చిన చెక్క, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
రైస్ కు రుచి, స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఇలా చెయ్యాలి
ఇందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు మరియు ఎండుమిర్చి వేయాలి. వెల్లుల్లిని సన్నని సెగపై అవి మంచి గోల్డెన్ బ్రౌన్ లేదా కాస్త ఎరుపురంగులోకి మారేంత వరకు వేపాలి. వెల్లుల్లి ఇలా వేగడం వల్లే రైస్‌కు మంచి క్రిస్పీ మరియు స్మోకీ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి మరో 30 సెకన్లు వేయించాలి. పోపు వేగాక, ముందుగా వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని అందులో వేయాలి.
ఘుమఘుమలాడే స్మోకీ ఫ్లేవర్ గార్లిక్ జీరా రైస్
దీనిపై మిరియాల పొడి, తగినంత ఉప్పు మరియు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి అన్నం జాగ్రత్తగా కలుపుతూ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా టాస్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే స్మోకీ ఫ్లేవర్ గార్లిక్ జీరా రైస్ సిద్ధం. దీనిని పప్పు తడ్కా, చోలే మసాలా లేదా పనీర్ గ్రేవీ కూరలతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.













Click it and Unblock the Notifications