పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌కు కూడా అనుమతి ఇచ్చేది లేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ!
తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని భావించిన నవ నిర్మాణ సభకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే సభ లేకున్నా, మీడియా సమావేశం నిర్వహిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసింది.
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్‌కు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సభకు హైకోర్టు, పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, తన ఇంట్లోనైనా ప్రెస్ మీట్ పెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనిపై స్పందించిన అద్దంకి దయాకర్, అలాంటి అవకాశం కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

రాజకీయ అస్థిరత సృష్టించాలని బీజేపీ కుట్ర.. అందుకే జనసేన ఇలా
తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించాలని బీజేపీ కుట్ర చేస్తోందని, ఆ కుట్రలో భాగంగానే జనసేనను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైషమ్యాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజల మనస్తత్వాన్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ కు సూచన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత బీజేపీ 'టార్గెట్ తెలంగాణ' అని చెబుతోందని, దానిలో భాగంగానే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణలో ప్రశాంతత కావాలని కోరుకుంటున్న ప్రజల మనస్తత్వాన్ని గౌరవించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా పాలన చేసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు సలహా ఇచ్చారు.
తెలంగాణలో రాజకీయాలు చేయడం సరికాదన్న అద్దంకి దయాకర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, అలాంటి వ్యక్తి తెలంగాణలో రాజకీయాలు చేయడం సరికాదని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి రాజకీయాలను ఊరుకోరని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంత వ్యతిరేఖత మధ్య పవన్ కళ్యాణ్ ఏం చేయనున్నారు అన్నది ఆసక్తిగా మారింది.













Click it and Unblock the Notifications