తెలంగాణ మీ అయ్య జాగీరా ? బెదిరింపులపై పవన్ ఫైర్..!

ఆంధ్రలో తనను తిరగనివ్వనని అంటే, తన వారాహికి అనుమతి ఇచ్చింది తెలంగాణాయే అని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. ఇక్కడి జనసైనికులే తనకు అండగా నిలిచారన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేద్దామని మా నాయకులు అంటే.. ప్రజలు కోరుకుంటే చూద్దామని చెప్పినట్లు వెల్లడించారు. ఇక్కడ కూర్చొన్నా ఆంధ్రలోనే అధికారం కోరుకుంటానని, తెలంగాణలో కేవలం మార్పు మాత్రమే కోరుకుంటానన్నారు. ఈ మధ్య మాట్లాడితే ఆంధ్ర ఆంధ్ర అంటున్నారని, తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదని, వాళ్లంతా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఇక్కడ ఉండే వారు కాదన్నారు. దీన్ని ఎవరూ మర్చిపోరన్నారు.

హైదరాబాద్ లో ఎలా అడుగుపెడతావని, ఇక్కడేం పని అని అడుగుతున్నారని, మీరెవరు నన్ను బెదిరించడానికి అన్నారు. బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణా అని ప్రశ్నించారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే తనకు బెదిరింపులు ఎక్కువన్నారు. తెలంగాణలో రానివ్వనంటారని, ఆంధ్రలో అయితే కోనసీమలో తల తీసేయమంటారన్నారు.తాను 2019లో ఓడిపోయినప్పుడు తెలంగాణ నాయకులు ఇక్కడ ఉంటే అలాంటి పరిస్ధితి రానిచ్చే వాళ్లం కాదన్నారు. తెలంగాణలో తాను సాధించేది ఏమీ లేదన్నారు. ప్రెస్ మీట్ కూడా ఇంట్లోనే ఎందుకు పెట్టానంటే, దాడి చేసే వాళ్లకు అవకాశం కోసమేననన్నారు. బాంచెన్ సారు కాల్మొక్తా అనే వాళ్లం అయితే పార్టీ ఎందుకు పెడతామన్నారు. మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా అన్నారు. 12 ఏళ్లలో ఒక్క తెలంగాణ నాయకుడిని అయినా ఒక్క మాట అనలేదన్నారు. తనకు పౌరుషం చచ్చిపోలేదని, తెలంగాణపై ప్రేమ కూడా చావలేదన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు మాట్లాడతానన్నారు.

Pawan Kalyan Serious on Warnings from Telangana Politicians Asks If State Is Their Property

తెలంగాణలో జనసేన ఎదగాలని కోరుకుంటున్నానని, ఇక్కడి జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన హెడ్ ఆఫీసును మంగళగిరిలో పెట్టుకున్నానన్నారు. తన గుండెల్లో తెలంగాణ ఉందని, తనను ఎంత తిట్టినా బెదిరిపోనున్నారు. ఏపీలో వైసీపీ గూండాల బెదిరింపుల కంటే ఇక్కడి వాళ్ల బెదిరింపులు ఎక్కువేమీ కాదన్నారు. ఓ విశ్లేషించే వ్యక్తి వల్లే ఈ గొడవ ప్రారంభమైందన్నారు. ఆయన మీడియాలో అమిత్ షా, తాను మాట్లాడుకున్నట్లు చెప్తే దాన్ని ఖండించామన్నారు. తనను ఓ మాట అంటే జనసైనికులు కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి వదిలేయమని చెప్పానన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా అభివృద్ది లేకపోవడానికి ఇంకా ఆంధ్రోళ్లు, పవన్ కళ్యాణే కారణమా అని అడిగారు. ఆంధ్రా ప్రజలు, తెలుగు సినీ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కారణం మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులే అన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన వారిలో పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన్నూ ఉరి తీయాలన్నారు. గుజరాతీలు సూరత్ లో, నాందేడ్ లో స్థానికులు తెలుగు వాళ్లు వద్దని తరిమేస్తే దేశం నిలబడుతుందా అని పవన్ అడిగారు.

Pawan Kalyan Serious on Warnings from Telangana Politicians Asks If State Is Their Property

నాగేశ్వర్ ను ప్రశ్నిస్తే తనకు తెలంగాణ అంటే పడదు, వ్యతిరేకం అని, చెరువు కబ్జా చేశానని ఆరోపణలు చేస్తున్నారని, తనకేం పనిలేదా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవమని, పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువును ఆక్రమించుకున్నాడని తేలితే దాన్ని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న ఓ అనలిస్ట్ .. వామపక్ష భావజాలాన్ని వదిలి ప్రాంతీయవాదానికి వచ్చారన్నారు. గద్దర్ మీద తన ప్రేమ ఈనాటిది కాదన్నారు. ఆయనకు తాను బండి కొనిచ్చానన్నారు. బతికున్నప్పుడు గద్దర్ కు మీరేం చేశారని ప్రశ్నించారు.

ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన వైఎస్ కు కొమ్ముకాసిన వ్యక్తులు ఇవాళ తన నాలుకలు కోస్తామంటున్నారని పవన్ విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రకు వస్తే తాను స్వాగతించానని, గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం పెట్టి, గతంలో జనసేనలో పనిచేసిన వ్యక్తిని ఏపీకి అధ్యక్షుడిగా పెడితే స్వాగతించామన్నారు. ఆంధ్రాలో సీఎంకు దిక్కులేని పవన్ కళ్యాణ్.. ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. కానీ ఇక్కడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామనే భయం అన్నారు. 2 వేల మంది జనసైనికులతో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వనంటే ఎలా అన్నారు. ఓ అనలిస్ట్ కూర్చుని అమిత్ షా గురించి మాట్లాడితే, తాను దాన్ని ప్రశ్నిస్తే ఇందులో ప్రాంతీయత ఎక్కడ ఉందని, తెలంగాణలో అవమానం ఎక్కడుందని, కులాలు ఎక్కడ వచ్చాయని, మాకు నొచ్చుకునే హక్కు కూడా లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పీకలు కోసుకుంటా కానీ తనకు భయం అయితే రాదన్నారు.

తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఏం పని అడుగుతున్నారని, అక్కడి కాంట్రాక్టర్లు ఇక్కడ బాగానే ఉన్నారని, మీరు ఎవరిని పిచ్చోళ్లని చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిజంగా వద్దనుకుంటే పవన్ కళ్యాణ్ ను రానివ్వబోమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలన్నారు. తన ప్రేమను శంకిస్తే .. ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదని, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా.. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేస్తామన్నారు. అవసరమైతే తెలంగాణలో తిరిగేందుకు సిధ్దమన్నారు. ప్రతీ సమస్య మీదా మాట్లాడతామనని, ప్రతీ అన్యాయాన్నీ ఎదుర్కొంటానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగమని మర్చిపోవదన్నారు. మీరు బెదిరిస్తే భరించేది లేదన్నారు. దశాబ్దం పైగా భరించామని, తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో ఉన్నారన్నారు. అయినా 12 ఏళ్లు కిక్కురుమనకుండా కూర్చున్నానన్నారు.

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు ఇలాగే బెదిరింపులకు దిగితే ఆ రోజున తెలంగాణ యువత తమకు అండగా నిలబడ్డారన్నారు. దేశ సమగ్రతకు భంగం కలగనంతవరకూ వేర్పాటువాదం మంచిదేనన్నారు. ఇదేమైనా పాలస్తీనానా అని ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంకలు వాయనాడ్ లో పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ మెదక్ లో పోటీ చేయొచ్చని, పీవీ నరసింహారావు నంద్యాలలో పోటీ చేశారని గుర్తుచేశారు. ఈ బెదిరింపులపై రాహుల్, ప్రియాంక స్పందించాలన్నారు. భారత్ లో ప్రతీ రాష్ట్రానికీ పాస్ పోర్టులు తీసుకుపోవాలా అని పవన్ అడిగారు. ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చి పన్నులు కడుతున్న వారిని బెదిరించొద్దన్నారు. భయపెట్టేకొద్దీ గుండె గట్టిపడుద్దే తప్ప భయపడదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+