జగన్ ఆస్తులపై దర్యాప్తు: సిబిఐ నోటీసులు

వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాను నడుపుతున్న జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్ సంస్థలతో పాటు వీటిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు, వ్యక్తులకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. జగతి పబ్లికేషన్స్‌లో 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. జగన్‌కు చెందిన 17 సంస్థలపై సిబిఐ
దృష్టి సారించినట్లు సమాచారం. ఈ సంస్థలు ఆదాయం పన్ను ఎంత చెల్లించాయని, పన్ను చెల్లింపునకు సంపాదనకు మధ్య పొంతన ఉందా అనే విషయాలను సిబిఐ విచారించనుంది.
వైయస్ జగన్ పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. సమయం తక్కువగా ఉండడంతో సిబిఐ బృందం శని, ఆదివారాలు కూడా పనిచేస్తోంది. సంస్థలు అందించిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత అవసరమైతే ఆయా సంస్థలకు చెందినవారి వ్యక్తిగతంగా కూడా సిబిఐ విచారించే అవకాశాలున్నట్లు సమాచారం.