తిరుపతి: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అధికార కాంగ్రెసు ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరినైనా విచారించ వచ్చునని అన్నారు. సిబిఐ దర్యాప్తులో ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సైతం విచారణకు అభ్యంతరం లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
అధిష్టానం తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పరిష్కారానికి కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. గురువారం ఢిల్లీలో ఎపి భవన్‌లో జరిగిన సంఘటన చాలా దురదృష్టం అన్నారు. ఇరు ప్రాంతాల నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ ప్రాంత మంత్రుల రాజీనామాల వల్ల పాలన కొంత స్తంభించిన మాట వాస్తవమే అన్నారు.