హైదరాబాద్: తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, సమైక్యాంధ్రకు అనుకూలం కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. గుల్బర్గా పర్యటనను ముగించుకుని ఢిల్లీ వెళ్తూ ఆయన శనివారం సాయంత్రం కాసేపు శంషాబాద్ విమానాశ్రయంలో ఆగారు. తెలంగాణ వచ్చిందని తెలంగాణ నాయకులు సంతోషించాల్సిన అవసరం లేదు, తమ పంతం నెగ్గిందని సీమాంధ్ర నాయకులు అనుకోవడానికీ లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరుపుతామని, ముందు తెలంగాణ నాయకులతో చర్చలు చేస్తామని ఆయన అన్నారు.
గుల్బర్గా పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి దానం నాగేందర్ పాల్గొన్నారు. విమానాశ్రయంలో గులాం నబీ ఆజాద్‌ను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ విడివిడిగా కలిశారు. పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, రాజయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు కలుసుకున్నారు. కాగా, సోమవారంనాడు ఆజాద్ తెలంగాణకు చెందిన 12 మంది ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.