జగన్ బాటలో గాలి: కర్నాటకలో కొత్త పార్టీ?

Gali Janardhan Reddy
బెంగళూరు: కర్నాటక భారతీయ జనతా పార్టీలో చక్రం తిప్పిన గాలి సోదరులు వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటకలో వారు కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్నటి వరకు పార్టీ అధిష్టానాన్ని, అప్పటి ముఖ్యమంత్రి యెడ్యూరప్పను తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న గాలి సోదరులు లోకాయుక్త నివేదిక, గనుల తవ్వకాలపై సుప్రీం కోర్టు కొరడా ఝులిపించిన తర్వాత రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి అండ లేక పోవడం, రాష్ట్రంలో కూడా సదానంద గౌడ మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంతో కొత్త పార్టీ పెట్టాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

లోకాయుక్త నివేదికతో యడ్యూరప్ప పదవే కాదు... గాలి సోదరులు, బి.శ్రీరాములు మంత్రి పదవులూ ఊడిపోయాయి. తప్పని సరి పరిస్థితుల్లో కొత్త సీఎం సదానంద గౌడ వీరిని దూరంగా పెట్టారు. అధిష్ఠానంలో సుష్మా స్వరాజ్ వంటి నేతలు గాలికి అండగా నిలవాలని ప్రయత్నిస్తున్నా... మరో బలమైన వర్గం నిలువరిస్తోంది. మరోవైపు... సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గనుల కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. దీంతో గాలి సోదరుల రాజకీయ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇన్నాళ్లూ తాము నడిపిన పవర్ పాలిటిక్స్‌కు తెరపడటం, ఆకాశమంత ఎత్తు ఎదిగిన పార్టీలో అణిగిమణిగి ఉండటం, పూలమ్మినచోటే కట్టెలమ్మాల్సి రావడం... వీటిని జీర్ణించుకోలేని గాలి జనార్దన రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

దీని గురించి అనుచరులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పెట్టిన 'వైఎస్ఆర్ కాంగ్రెస్' పేరు ధ్వనించేలా... గాలి 'బీఎస్ఆర్ కాంగ్రెస్' పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బీఎస్ఆర్ అంటే... 'బళ్లారి - శ్రీరాములు - రెడ్డి' అని విశ్లేషిస్తున్నారు. పార్టీ పేరు ఇప్పటికి ప్రతిపాదన దశలోనే ఉందని చెబుతున్నారు. మొత్తానికి... ఆంధ్రప్రదేశ్‌లో జగన్, కర్ణాటకలో తాము గెలుచుకునే ఎంపీ స్థానాలతోపాటు, రెండు మూడు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలతో అవగాహన కుదుర్చుకుంటే జాతీయ రాజకీయాలను శాసించవచ్చునని గాలి వర్గం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గాలి జనార్దన రెడ్డి సోమవారం లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్లి, ఎన్నికల కమిషన్‌కు కొత్తపార్టీ ఏర్పాటుపై దరఖాస్తు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. నిజానికి... గాలి గతంలో కాంగ్రెస్, జనతా దళ్(ఎస్)లలో చేరాలని ప్రయత్నించినప్పటికీ, ఆ పార్టీల్లోని ముఖ్య నేతలు అడ్డుకున్నట్లు సమాచారం.

ఎందుకిలా?: కర్ణాటకలో 'కమలం' వికసించడానికి తానే ముఖ్యకారణమని, ఇప్పడు పార్టీ పెద్దలే తనను గాలికి వదిలేస్తే ఎలాగని గాలి జనార్దన రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. గాలి వర్గానికీ, యడ్యూరప్పకూ చాలాకాలం క్రితమే రాజకీయ వైరం ఏర్పడింది. యడ్యూరప్పను పదవి నుంచి దించి... దానిని తమ వర్గీయుడికి కట్టబెట్టి, రాష్ట్రమంతా ఆధిపత్యం సాధించాలని గాలి ప్రయత్నించారు. కానీ... అది కుదరలేదు. అటు యడ్యూరప్ప కూడా కొంత రాజీ పడి తన పదవి కాపాడుకున్నారు. గాలి వర్గం ప్రాధాన్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత సదానంద మంత్రి వర్గంలో బెర్తుల కోసం గాలి సోదరులు ఎంత ప్రయత్నించినా ఫలితం లభించలేదు. "బీజేపీ వాసన కూడా లేని కాలంలో, నా శక్తియుక్తులతో పార్టీని బలోపేతం చేశాను. నా మాటకే విలువ లేదా?' అని గాలి ఊగిపోతున్నారు. 'ఇలాంట ప్పుడు పార్టీలో ఉండడమెందుకు?' అని వాదిస్తూ సొంత పార్టీ పెట్టే దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది.

ఇక గాలి వర్గానికి చెందిన శ్రీరాములు కూడా గదగ్, హుబ్లీ, తుంగభద్ర డ్యాంలలో జరిగిన కార్యక్రమాల్లో మాట్లాడిన బీజేపీ అధిష్ఠానాన్ని హెచ్చరించేలా ఉండటం గమనార్హం. బళ్లారిలోని తన ఇంట్లో కొందరు ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో గాలి రాజకీయ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే శ్రీరాములు ఆదివారం సంచలన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. బెంగళూరులోని గ్రాండ్ అశోకా హోటల్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బహుశా... ఆయన తన రాజీనామా గురించి ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఉత్తర కర్ణాటకకు చెందిన 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, తమకంటూ ప్రత్యేక బలగం ఉందని ఆయన గతంలో బాంబు పేల్చారు. అయితే... ఇవన్నీ వదంతులే అని, వీటిని ఖండించేందుకే శ్రీరాములు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+