తల నరుక్కుంటా గానీ తల దించేది లేదు: కెసిఆర్

K Chandrasekhar Rao
కరీంనగర్: తెలంగాణ కోసం అవసరమైతే తల నరుక్కుంటాను గానీ తలదించే ప్రసక్తే లేదని, ఎత్తిన జెండా దించేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. పదకొండేళ్ల ఉద్యమం తర్వాత కూడా తమలో తెలంగాణ కోసం పట్టుదల తగ్గలేదని ఆయన అన్నారు. తెలంగాణ సాధించడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాకపోతే సీమాంధ్ర నాయకులు పాతాళానికి తొక్కుతారని ఆయన అన్నారు. కరీంనగర్‌లో జరిగిన జనగర్జన బహిరంగ సభలో ఆయన సోమవారం రాత్రి మాట్లాడారు.

కాంగ్రెసు తెలంగాణ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలి గానీ అభిమానం గానీ సిగ్గు గానీ లేదని ఆయన అన్నారు. ఒక్క నాయకుడి మీద ఎస్మా ప్రయోగిస్తే అగ్గి లాగా తెలంగాణ రగిలిపోతుందని ఆయన అన్నారు. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తే అగ్గి బరాటాలై రగిలిపోదామని ఆయన అన్నారు. తెలంగాణ ఏమంటుందో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు మధ్య సంబంధాలు తెగిపోవాలని, 15వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలని ఆయన అన్నారు.

సకల జనుల సమ్మెకు దిగే తెలంగాణ ఉద్యోగుల వెనక నాలుగు కోట్ల మంది ప్రజలున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడుగుతుంటే ఎస్మా ప్రయోగిస్తామని అంటోందని, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా అని ఆయన అన్నారు. ఒక్క ఉద్యోగిపైన చేయి పడినా న్యాయవాదులు న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. బడి గంట మోగదని, సింగరేణిలో బొగ్గు పెళ్ల పెగలదని, రైలు ఒక్కటి కూడా కదలదని, ఆర్టీసి బస్సులు తిరగవని ఆయన అన్నారు.

బాన్సువాడలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్ల మాటలు ఎన్నింటినో భరించామని, బెదిరేది లేదని ఆయన అన్నారు. వెర్రిబాగులవాడు ఏదో అంటే బెదిరిపోయేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై సీమాంధ్ర నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కండకావరమా, అహంకారమా అని ఆయన అడిగారు. మంత్రి టిజి వెంకటేష్ నాలుక తెగకోస్తామని ఆయన హెచ్చరించారు. కోదండరామ్‌ను ఏమైనా అంటే ఊరుకునేది లేదని ఆయన అన్నారు.

తెలంగాణ విద్యార్థులను పనికిరానివాళ్లు అన్న కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి, కావూరి సాంబశివరావులను ఆయన వాడు గిదే మాట్లాడుతడు, వీడు గదే మాట్లాడుతడని అన్నారు. పొగాకు ఎగుమతిలో అక్రమాలకు పాల్పడిన కావూరి సాంబశివరావును తమకు అప్పగించాలని చైనా డిమాండ్ చేసిందని, ఆ దొంగ తెలంగాణ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తాము సంస్కారంగానే ఉంటామని, రఫోట్ మాట్లాడితే తాము రఫరఫలాడిస్తామని ఆయన అన్నారు. నోరు దగ్గర పెట్టుకోవాలని ఆయన సీమాంధ్ర నాయకులను హెచ్చరించారు.

ప్రాంతీయ పక్షపాతివి కాకపోతే హైదరాబాదు, కరీంనగర్ రైల్వే లైన్లపై ముఖ్యమంత్రి ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఆయన అడిగారు. నలుగురైదుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం గట్టిగా ఉన్నారని ఆయన అన్నారు. భయపడవద్దని, అదే మాట ఉండాలని ఆయన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. తెలంగాణ, విదర్భ బంధించబడి ఉన్నాయని ఆయన అన్నారు. విదర్భ కోసం పోరాడుతున్న దంపతులు కరీంనగర్ సభకు వచ్చారు. రాజీనామాలకు ముందుకు వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లారని, కుక్క తోకకు గుండు కడితే చక్కగవుతుందా అని ఆయన అన్నారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా అని ఆయన అడిగారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా రేపు (మంగళవారం) రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

సభలో తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర రావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామి గౌడ్, న్యూడెమొక్రసీ నాయకుడు సూర్యం తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+