తెలంగాణపై రెండు రోజుల్లో నిర్ణయం వస్తుందా?

పార్టీపరంగా ఒక నిర్ణయానికి రావడానికే కాంగ్రెసు అధిష్టానం కసరత్తు చేస్తోంది. అదే విషయాన్ని ఆజాద్ చెప్పారు. సీనియర్ నాయకులతో మాత్రమే మాట్లాడుతున్నామని, అందువల్ల చర్చలు ముగించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చునని ఆయన అన్నారు. ఇతర పార్టీల నాయకులతో మాట్లాడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె విరమించడానికి అనువైన ప్రకటన మాత్రమే ఇప్పుడు కాంగ్రెసు అధిష్టానం చేయవచ్చుననే మాట వినిపిస్తోంది.
శనివారం సాయంత్రం మినీ కోర్ కమిటీ సభ్యులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లతో మాట్లాడారు. తెలంగాణ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ మీడియాతో అన్నారు. అధిష్టానం పెద్దలకు ఏం చెప్పాననే విషయాన్ని తాను వెల్లడించబోనని ఆయన చెప్పారు. తెలంగాణపై తన అభిప్రాయం చెప్పానని డి. శ్రీనివాస్ అన్నారు. తాను వాస్తవ పరిస్థితులను చెప్పానని, సమస్య పరిష్కారానికి అందరూ సహకరించాలని ఆయన అన్నారు. సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications