జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెసుతో బాబు కుమ్మక్కు: కెసిఆర్

తెలంగాణ బిడ్డలంతా ఏకమవుతున్న సందర్భమని, జెండాలను, ఎజెండాలను పక్కనపెడుతున్నారని ఆయన అన్నారు. తలుపులు పెట్టి పిల్లిని కొడితే గొంతు కొరుకుతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం జూపల్లి కృష్ణారావు దండం పెట్టి ఇప్పుడు దండాన్ని అందుకున్నారని ఆయన అన్నారు. దరఖాస్తు పెట్టారని, దండం పెట్టారని, లాభం లేక తిక్కరేగి రాజీనామా చేసి వచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని ఇంకా పరీక్షించవద్దని, తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల, మతాల, కులాల ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు, శానససభ్యులు ఎందుకు మౌనంగా ఉంటారని ఆయన అడిగారు. కాంగ్రెసుకు రాజీనామా చేసిన ముగ్గురు శాసనసభ్యులు రాజయ్య, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ కెసిఆర్ సమక్షంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.
సీమాంధ్ర నేతలకున్న రేషం తెలంగాణ ప్రజాప్రతినిధులకు లేదా అని ఆయన అడిగారు. డిసెంబర్ 9వ తేదీన ప్రకటన రాగానే సీమాంధ్ర నాయకులంతా ఒక్కటై రాజీనామాలు చేశారని, వచ్చిన తెలంగాణను అడ్డుకున్నారని, అదే పద్ధతిని తెలంగాణ నాయకులు ఎందుకు అనుసరించడం లేదని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడవదని, ఈ మాత్రం సోయి తెలంగాణ ప్రజాప్రతినిధులు లేదా అని ఆయన అన్నారు. కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని, రోశయ్యతో కుమ్మక్కయి తెలంగాణను అడ్డుకున్నారని ఆయన అన్నారు. రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసుకు ఓట్లేయించలేదా అని ఆయన అడిగారు. కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలనుకుంటే దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చే శాసనసభా సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని, లేదంటే చంద్రబాబు తెలంగాణ ద్రోహి అవుతారని ఆయన అన్నారు. చంద్రబాబు, ఆయన తొట్టి గ్యాంగ్ తెరాస కాంగ్రెసులో విలీనమవుతుందని ప్రచారం చేశారని, కాంగ్రెసు పార్టీయే తెరాసలో వీలినమవుతుందని నేటి సంఘటన తెలియజేస్తోందని ఆయన అన్నారు. తెరాస ఏ పార్టీలోనూ విలీనం కాదని, అత్యధిక స్థానాలు గెలుచుకుని ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న ఒక్కో చావుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమని రాజయ్య అన్నారు. తెరాసను ఆయుధంగా ఎంచుకుని కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నమ్మి వచ్చామని ఆయన అన్నారు. తమ రాజీనామాలతో ఢిల్లీ పీఠం కదిలి కేంద్రానికి కనువిప్పి కలిగాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కార్యకర్తలకు తాను అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు బాధ్యతలు విస్మరించారని జూపల్లి కృష్ణారావు అన్నారు. పదవులు ముఖ్యం కాదని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినవారే ప్రజాప్రతినిధులవుతారని, దాన్ని విస్మరిస్తే ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు. కెసిఆర్ మాత్రమే తెలంగాణ సాధిస్తారనే నమ్మకంతోనే తెరాసలో చేరినట్లు ఆయన తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులు ఇప్పటికైనా ప్రజా ఉద్యమంలోకి రావాలి, లేదంటే బజారుకీడుస్తామని ఆయన అన్నారు. కొంత మంది సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుందని సోమారపు సత్యనారాయణ అన్నారు. రెండేళ్లు దాటేశారంటే తెలంగాణ ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెసుకు లేదని అర్థమవుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications