కెసిఆర్, జగన్ కలిసి కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు?

నవంబర్ 10వ తేదీలోగా మరింత మంది కాంగ్రెసు శాసనసభ్యులు తెరాసలోకి వస్తారని ఆదివారం తెరాసలో చేరిన శాసనసభ్యుడు రాజయ్య అన్నారు. అంకెలను చూస్తే కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదం అంచున ఉన్నట్లే కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో కాంగ్రెసు బలం శాసనసభలో ఇప్పుడు 144 ఉంది. మెజారిటీకి కావాల్సిన శాసనసభ్యుల సంఖ్య 148. మజ్లీస్‌కు చెందిన ఏడుగురు శాసనసభ్యులు మద్దతిస్తారు కాబట్టి ప్రభుత్వానికి 151 మంది శాసనసభ్యుల మద్దతు ఉంటుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ప్రభుత్వానికి 152 మంది శాసనసభ్యుల బలం ఉంది.
వైయస్ జగన్ వెంట 26 మంది కాంగ్రెసు శాసనసభ్యులున్నారని అంచనా వేస్తున్నారు. తెరాస బలం 17కు పెరిగింది. అయితే, ఆదివారం రాజీనామా చేసిన ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులను లెక్కలోకి తీసుకుంటే ఆ సంఖ్య 17 అవుతుంది. వారు శాసనసభా సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు కాబట్టి ఆ సంఖ్య ఎలా ఉంటుందో చెప్పలేం. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి 83 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ వద్ద దాదాపు 80 మంది శాససనభ్యుల రాజీనామాలు పెండింగులో ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని అంటున్నారు. అందుకే, వచ్చే శీతాకాలం సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని కెసిఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును సవాల్ చేశారు.
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రకటనతో తెలంగాణకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం ఉండబోదని అంచనాకు వచ్చిన మరింత మంది కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలు చేసి తెరాసలోకి వస్తారని అనుకుంటున్నారు. అలా వస్తే గనుక ప్రభుత్వానికి ముప్పు తప్పదని అంటున్నారు. ఇదంతా జరగడానికి, పరిణామాలు మలుపు తీసుకోవడానికి శాసనసభ సమావేశాల దాకా ఆగాల్సిందేనని అంటున్నారు. డిసెంబర్ 4వ తేదీలోగా శాసనసభను సమావేశపరచాల్సి ఉంటుంది. అంటే, సర్దుకోవడానికి ప్రభుత్వానికి నెలకు పైగానే గడువు ఉంది. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోగా కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. కానీ, కాలయాపన చేసే విధంగా లేదా తెలంగాణకు వ్యతిరేకంగా ఆ నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పెద్ద గండాన్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications