రాజీనామాలు: కాంగ్రెసుది మేకపోతు గాంభీర్యమేనా?

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్ష తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో మరింత వేడి పుట్టిస్తుందని అంటున్నారు. మరింత మంది కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ అంతరంగాన్ని విప్పే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఐదుగురు శానససభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు తెరాసలోకి వెళ్తారని తమకు ముందే తెలుసునని, వెళ్లింది తక్కువేనని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కానీ పరిస్థితి అంత మాత్రంగానే లేదని కాంగ్రెసు నాయకులు లోలోపల మథనపడుతూనే ఉన్నారు.
ముగ్గురు శాసనసభ్యులు తమ పదవులకే కాకుండా పార్టీకి కూడా రాజీనామాలు చేయడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ మనుగడపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు లేదని కాంగ్రెసు నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ, క్రమక్రమంగా బలం తగ్గిపోతుందనేది మాత్రం స్పష్టం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగులో ఉన్నాయి. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు మరి కొంత మంది రాజీనామాలు చేసే దిశగా కదులుతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని అంటున్నారు. అందువల్లనే నష్టనివారణ చర్యగా అధిష్టానం తెలంగాణకు చెందిన సీనియర్ నేత కె. కేశవరావుతో ప్రకటన చేయించారని అంటున్నారు.
తమ పార్టీ శాసనసభ్యులను తెరాస లాక్కోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు అంటున్నారు. పార్టీలను చీల్చడం వల్ల తెలంగాణ రాదని వారంటున్నారు. తెరాస వైపు వెళ్లాలని చూస్తున్న తమ పార్టీ శాసనసభ్యులు పునరాలోచనలో పడడానికి పార్లమెంటు సభ్యులతో పార్టీ అధిష్టానం ఆ ప్రకటన చేయించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications