సాక్షి పత్రిక ధర పెరుగుదలకు వైయస్ జగన్ వివరణ

సాక్షి పుట్టిన కొద్ది సంవత్సరాలలోనే ప్రజాభిమాన చూరగొన్నదని, యెల్లో మీడియా మాఫియా అవతారమెత్తి పసుపు పార్టీతో కలిసి ఒక సంఘటన తాలుకు పూర్తి నిజానిజాలను ప్రజలకు చేరవేయకుండా ఒకవైపు మాత్రమే చూపిస్తూ మరోవైపు దాచేస్తున్న సమయంలో నాణేనికి మరోవైపును చూపించేందుకే సాక్షి పుట్టిందని చెప్పారు. నాటి పాలకులూ, ఎల్లో మీడియా కలిసి జనం కళ్లకు గంతలు కట్టి సాగించిన ఆరాచకాన్ని వరుసపెట్టి జనం ముందుకు తీసుకు వస్తుండటంతో సాక్షిపై కత్తి కట్టి అంతం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నాటి ఉదయం పత్రికను అదే విధంగా మూసి వేయించారన్నారు.
సాక్షి పైన కూడా ఇలాంటి కుట్రలు చేయాలనుకున్నారని అయితే అది నెరవేరక పోవడంతో ఆర్థిక మూలాలపై కన్నేశారని, జగతి పబ్లికేషన్‌లోకి వచ్చిన పెట్టుబడులు అక్రమాలంటూ సాక్షిని టార్గెట్ చేశారని, అలాగే తనకు ఓదార్పులో వస్తున్న ప్రజాభిమానం చూసి వారు తట్టుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. ఇదే అదనుగా ఎల్లో సిండికేట్ నేతలు కాంగ్రెసు అధిష్టానంతో సాన్నిహిత్యం మొదలు పెట్టి అధికారం, అంగ, అర్థ బలాలను అడ్డం పెట్టుకొని సాక్షిని, యాజమాన్యాన్ని, కేసుల్లో ఇరికించి లబ్ధి పొందే కుట్రలు అమలు చేశారన్నారు. కుట్రదారులు ఆర్థిక దాడుల్ని తీవ్రతరం చేయడంతో పాటు ఇన్వెస్టర్లను భయభ్రాంతుల్ని చేసి నిధులు రాకుండా అడ్డుకున్నారన్నారు. కొత్త ఇన్వెస్టర్లు సాక్షి వైపు చూడకుండా చేశారని, కేసుల్లో ఇరికించి న్యాయస్థానాల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు.
ఈ పోరాటంలో తుది గెలుపు సాక్షిదే అవుతుందని, అయితే ఏ సంస్థకైనా ఆరంభంలో బయటి నుంచి నిధులు రావటం అవసరమని, అందులోనూ భారీ ఎత్తున ఆవిర్భవించిన మీడియా సంస్థ లాభనష్టాల్లేని స్థితికి రావాలంటే ఐదారేళ్లు పడుతుందని, ఇప్పుడు సాక్షిలోకి ఇన్వెస్టుమెంట్లు రాకుండా చేయడం ద్వారా దాని గొంతు నులిమేయాలన్న ఎల్లో సిండికేట్ కుట్రను విజయవంతంగా ఛేదిస్తూ వస్తున్న సాక్షికి ఇప్పుడు తన సొంత కాళ్లపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చారు. కొత్త ఇన్వెస్టుమెంట్లు రాకపోయినా తట్టుకునేలా అంతర్గత వనరుల్ని పెంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అందుకే కష్టకాలంలోనూ మమ్మల్ని వెన్నంటి ఉన్న పాఠకులు కాస్తంత ధరాభారాన్ని భరించి సహకరిస్తారనే నమ్మకంతో ధరను పెంచాలని నిర్ణయించామన్నారు.












Click it and Unblock the Notifications