బైపోల్స్ ఒకేసారి నిర్వహించాలి: ఈసికి జగన్ వర్గం లేఖ
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నం జగన్ వర్గం ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని తాము ఈసికి లేఖ రాసినట్లు చెప్పారు. తాము అసెంబ్లీలో వైయస్సార్ సిఎల్పీగా పని చేస్తామన్నారు. సభలో ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. భూకేటాయింపులకు సంబంధించి అన్ని అంశాలు పరిశీలించాలన్నారు. ఆ మేరకే సభా సంఘం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఉదయం అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కండువాతో హాజరైన విషయం తెలిసిందే. వారు గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వం తీరుపై విరుచుకు పడ్డారు.
కాగా తెలంగాణ ప్రాంతంలోని ఖాళీ అయిన ఆరు నియోజకవర్గాలు, సీమాంధ్ర ప్రాంతంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఒకసారి, జగన్ వర్గం ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మరోసారి ఎన్నికలు జరిగేలా కాంగ్రెసు పార్టీ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇరు ప్రాంతాలలో ఒకేసారి ఎన్నికలు వస్తే ఎదుర్కోవడం కష్టమనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు మొదట తెలంగాణలో ఎన్నికలు జరగాలని కోరుకుంటుంది. అందుకే ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు జగన్ ఎమ్మెల్యేలపై వేటును ఆలస్యం చేయాలనే ఆలోచనతో ఉందనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెసు వ్యూహంపై దెబ్బ కొట్టాలనే భావనతో వైయస్సార్ కాంగ్రెసు అన్ని నియోజకవర్గాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసికి లేఖ రాసింది.
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas wrote a letter to election commission about state bypoll. They appealed EC in their letter, release notification at a time for bypoll.
Story first published: Monday, February 13, 2012, 16:10 [IST]