కర్నూలు: రైతుల కోసం అవసరమైతే తాను శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కూకట్ పల్లి శాసనసభ్యుడు, లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం అన్నారు. ఆయన సత్యాగ్రహ యాత్రను రెండో రోజు మంత్రాలయం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కష్టపడి పంటను పండించే రైతుకు తన ధాన్యం ఇష్టం వచ్చిన చోట అమ్ముకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. రైతుల కోసం మరిన్ని యాత్రలు నిర్వహిస్తానని చెప్పారు. అదిలాబాద్ జిల్లాలోని తడ గ్రామం నుండి తన రెండో దశ సత్యాగ్రహ యాత్రను ప్రారంభిస్తానని చెప్పారు. రైతులు తమ పంట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోకుండా ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడమేమిటన్నారు.
వచ్చే వారం ఆంక్షలు ఉల్లంఘించిన ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తామని అన్నారు. తాము అదిలాబాద్ నుండి మహారాష్ట్ర, శ్రీకాకుళం నుండి ఒరిస్సా, ధర్మపురి నుండి తమిళనాడుకు పంటను తరలిస్తామన్నారు. ఆరవై ఐదు ఏళ్ల దుర్మార్గపు పాలనతో నగరం, పల్లెల్లో రైతులు యాచకులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అరెస్టు చేస్తే ఎవరూ సహనం కోల్పోకుండా సంయమనంతో అరెస్టులకు సహకరించాలని శ్రేణులకు సూచించారు. ఆయన కర్నాటకలో ధాన్యాన్ని అమ్మేందుకు రైతులను తీసుకొని వెళుతున్నారు.