కిరణ్‌పై ఫిర్యాదు చేయలేదు, నేను దిగజారలేదు: డిఎస్

తన ధోరణిలో తాను బాగా కష్టపడుతున్నారని, కొత్త పథకాలతో పెద్ద ఎత్తున జనాభాకు లాభం చేకూర్చే చర్యలు చేపడుతున్నారని, ఆయనకు సహకరించి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపైనా ఉందని అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి సమయం సమయం, సందర్భం, ముహూర్తం రావాలన్నారు. తెలంగాణ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిఎం కిరణ్‌పై మేడమ్‌కు తాను ఫిర్యాదు చేయలేదని డిఎస్ చెప్పారు. ముఖ్యమంత్రి అందరినీ కలుపుకుపోవటం లేదని మేడమ్‌కు తాను చెప్పలేదని, అలా చెబితే ఫిర్యాదు చేసినట్లే అవుతుందని అన్నారు. అసలు ఈ విషయంపై తనకు, సోనియాకు మధ్య చర్చే జరగలేదని చెప్పారు. ఒకరిపై ఫిర్యాదు చేసేంతటి కిందిస్థాయికి తాను దిగజారబోనని, తనది ఆ స్థాయి కాదని అన్నారు. ఏదైనా విషయం ఉంటే సిఎం, పిసిసి అధ్యక్షుడితో సహా రాష్ట్రంలో ఏ నాయకుడికైనా ముక్కుసూటిగా చెప్పగల ధైర్యం, సన్నిహిత సంబంధం తనకు ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో చర్చించామన్నారు. వారిని మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. వారి వద్ద అన్ని విషయాల గురించి కూలంకషంగా చర్చించానన్నారు. ఉప ఎన్నికల్లో ఏది ఎలా చేస్తే బాగుంటుందన్న అంశాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై కూడా తమ మధ్య చర్చ జరిగిందన్నారు. 2014లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీలో కుమ్ములాటలు ఉన్నా ఎన్నికల వరకు అందరూ కలిసి పోతారన్నారు.