నెల్లూరు: తన వేష భాషలతో నిత్యం మీడియాకెక్కే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి సోమవారం విచిత్ర వేషధారణతో అందరినీ ఆశ్చర్యపరిచారు. వివేకానంద రెడ్డి సోమవారం నెల్లూరులో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. ఎగ్జిబిషన్‌లో ఉన్న దుకాణ సముదాయాలను తిలకించారు. ఆ సమయంలో ఆయన ఓ గాజుల దుకాణం ముందు ఆగి గాజులు వేసుకొని చూపరులకు కనువిందు చేశారు. ఆ తర్వాత మెడలో నగలు వేసుకుని చూసుకున్నారు. దుకాణంలో ఉన్న లిప్‌స్టిక్ తీసుకొని పెదాలకు రుద్దుకున్నారు. అంతేకాదు తాను ఎలా ఉన్నానని మహిళలను అడుగుతూ హొయలు పోయారు. ఎగ్జిబిషన్‌లో లిప్‌స్టిక్ పెట్టుకొని, నగరు ధరించి, గాజులు వేసుకొని వెరైటీ వేషాలు వేసిన ఆనంను చూసి అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
కాగా కర్నూలు జిల్లా రాజకీయ నాయకుడు బంగి అనంతయ్య తన నిరసనను విచిత్రంగా తెలియజేసే విషయం తెలిసిందే. చెప్పుతో కొట్టుకొని, చీర కట్టుకొని, రిక్షా తొక్కి ఇలా వివిధ రూపాల్లో ఆయన నిరసన తెలుపుతుంటారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఆయన చిప్ప చేతిలో పట్టుకొని బాబును నమ్ముకుంటే తనకు చిప్పే మిగిలింది అంటూ భిక్షమెత్తారు. అయితే అనంతయ్య నిరసన తెలిపేందుకు విచిత్ర వేషధారణలు వేస్తే ఆనం మాత్రం అందరినీ అలరించడానికి వెరైటీలు చేస్తుంటారు.