పదునెక్కిన మాటలు: ఇక్కడ బాబు, అక్కడ చిరంజీవి

కొల్లాపూర్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెరాస చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ విలువలు లేని వ్యక్తి అని విమర్శించారు. తెలంగాణలో టిడిపికి పెద్ద ఎత్తున క్యాడర్ ఉందన్నారు. తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణా రావు బ్యాంకులు దివాళా తీసేలా అప్పులు చేశారని ఆరోపించారు. కృష్ణారావు అవినీతి స్కామ్‌ను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాఫీ చేశారని అన్నారు. రైతు పోరు బాటలో తనపై ఉద్దేశ్య పూర్వకంగా దాడులు చేయించారని తెరాసపై మండిపడ్డారు. తమ కార్యకర్తలు అడ్డుకోవడం ప్రారంభిస్తే తెలంగాణలో కెసిఆర్ తిరగలేరన్నారు. ఉప ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదన్నారు. తెరాస వసూళ్ల కోసమే ఎన్నికలు తెచ్చిందని విమర్శించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులకు పదవీ వ్యామోహం తప్ప తెలంగాణపై ప్రేమ లేదన్నారు. తమ కార్యకర్తల జోలికి మంత్రి డికె అరుణ, జూపల్లి వర్గీయులు వస్తే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెసు అరాచక శక్తులకు టిడిపి భయపడదన్నారు. టిడిపి ఎప్పడూ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు.
తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలకు ఇది రాచరిక వ్యవస్థ కాదని జగన్‌పై విరుచుకు పడ్డారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్న అఖిలేష్ యాదవ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పదవీ కాంక్షతోనే జగన్ స్వార్థ పూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అత్యాశతో ప్రజా తీర్పును అపహాస్యం చేశారని విమర్శించారు. ప్యాకేజీకి ఆశలు పడి ఉప ఎన్నికలు తీసుకు వచ్చారన్నారు. కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించి సంక్షేమానికి బాటలు వేయాలన్నారు.
తండ్రి చనిపోయాడని బాధ లేకుండా ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసు పార్టీని కూడా ధిక్కరించి జగన్ పార్టీ పెట్టడాన్ని చిరు తప్పుపట్టారు. చంద్రబాబు పైనా ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులు బిల్లులు కట్టకుంటే బేడీలు వేయించిన చరిత్ర బాబుది అన్నారు. వంచనకు మారుపేరైన బాబును ఓడించాలన్నారు. చంద్రబాబు బుచ్చిరెడ్డిపాలం మండలంలోని జొన్నవాడ, ఇందుకూరు మండలంలోని డేవిస్ పేట, కొత్తూరు, ఇందుకూరు పేట, నర్సాపురం, మైపాడు, గంగపట్నం, కొమరిక, రావూరు, జగదేవుపేట తదితర గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఆయనను చూడటానికి మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు. చిరుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రచారంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. వీధి దీపాలు మరమ్మతు చేయించలేని వారు తెలంగాణ ఎలా సాధిస్తారని కెసిఆర్‌ను ఉద్దేశించి షబ్బీర్ అన్నారు. ఎలక్షన్లు, కలెక్షన్లకు కెసిఆర్ పరిమితమయ్యారన్నారు. మగాడివైతే టిడిపి నేతలందరితో రాజీనామా చేయించాలని సవాల్ చేసిన కెసిఆర్‌కు రేవంత్ రెడ్డి, కొత్తకోట దయాకర రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. తాము రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఉప ఎన్నికలతో తెలంగాణ రాకపోతే ఎన్నికలకు దూరంగా ఉంటానని కెసిఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాము రాజీనామాకు సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications