హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు తాఖీదులు జారీ చేయడంపై మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి సోమవారం విచిత్రంగా స్పందించారు. తాను తప్పు చేయలేదని సీతాదేవికి తెలుసునని, అలాగే శ్రీరాముడికి కూడా తెలుసునని ఆయన రామాయణాన్ని ఉటంకించారు. అయినా ప్రజల కోసం సీతాదేవి అగ్ని ప్రవేశం చేయక తప్పలేదన్నారు. ఇప్పుడు నోటీసులు అందుకున్న మంత్రులదీ అదే పరిస్థితి అని ఆయన అన్నారు. వారు కూడా సీతాదేవి వలె అగ్నిపునీతులై తిరిగి వస్తారని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లోని మంత్రులకు నోటీసులు, విచారణను స్వాగతించాలని ఆయన అన్నారు. మంత్రులు పునీతులు కావాలన్నారు.
కాగా మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసుల అంశం బిఎసి సమావేశంలోనూ రగడకు దారి తీసింది. కళంకిత మంత్రులు స్వయంగా తప్పుకోవాలని లేదా వారిని ముఖ్యమంత్రి తప్పించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెసు ధీటుగా స్పందించింది. దీంతో కాంగ్రెసు, టిడిపి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా పడిన అనంతరం మళ్లీ ప్రారంభమైంది.