హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసిన అంశం సోమవారం శాసనసభలో దుమారం రేగింది. నోటీసుల విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంత్రులు రాజీనామా చేయని పక్షంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని తప్పించాలని టిడిపి డిమాండ్ చేసింది. అందుకు మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, బొత్స సత్యనారాయణ తదితరులు ధీటుగా స్పందించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. నోటీసులు ఇంకా తమకు అందలేదన్నారు. అందిన వెంటనే సమాధానం చెబుతామన్నారు. తాము న్యాయవ్యవస్థను గౌరవిస్తున్నామన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామన్నారు. వివరణ ఇస్తామన్నారు. తాము చంద్రబాబులా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోమని ఎద్దేవా చేశారు. టిడిపికి తమ రాజీనామాలు అడిగే హక్కు లేదన్నారు. పాలనలో జరిగిన తప్పులకు మంత్రివర్గం బాధ్యత వహిస్తుందని, తప్పించుకునే ప్రయత్నాలు తాము చేయమన్నారు. ప్రధాన సమస్యను పక్కకు పెట్టి టిడిపి దీనిని రాద్దాంతం చేయడం సిగ్గు చేటు అన్నారు.
ప్రజల్లో టిడిపి పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఇప్పటికైనా వారు బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజలు టిడిపి, చంద్రబాబు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. సాక్ష్యాలు తీసుకోవడానికే సుప్రీం నోటీసులు జారీ చేసిందని, దోషులను ఇంకా తేల్చలేదన్నారు. ఎవరేమిటో ప్రజలకు తెలుసునని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నోటీసులకు సమాధానం ఇస్తామని చెప్పారు. సభలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలాంటి పరిణామాలనైనా తాము, మంత్రులు కోర్టులో, సభలో ఎదుర్కోవడానికైనా సిద్ధమన్నారు. కాగా టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామాకు పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.