విశాఖపట్నం: తనకు మీడియానే శ్రీరామ రక్ష అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి, ఎమ్మార్ కేసులు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అన్నారు. ఆయన ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టు పాఠశాల, కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చారు. ఈ కార్యక్రమం విశాఖలోని ఓ హోటల్లో జరిగింది. అనంతరం ఆయనను మీడియా పలకరించింది. విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశంలో ప్రభుత్వ అధికారుల భద్రతను బలోపేతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఐపిఎస్ అధికారి నరేందర్ కుమార్ సింగ్ హత్య అత్యంత విషాదకర ఘటనగా పేర్కొన్నారు. సిబిఐకి సంబంధించిన చట్టాల బలోపేతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఇప్పటికే ఉన్న చట్టాలను సమర్థవంతంగా వినియోగించుకున్నా మరింత మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం మీకు అదనపు భద్రత ఏర్పాటు చేసిందా అని విలేకరులు ప్రశ్నించగా.. మీడియానే తనకు రక్ష అన్నారు. బెదిరింపు కాల్స్ వచ్చాయా అని ప్రశ్నిస్తే ఆయన చిరునవ్వి నవ్వి ఊరుకున్నారు. తాను వ్యక్తిగత కార్యక్రమానికి వచ్చానని, సిబిఐ కేసుల వివరాలను తాను మాట్లాడ దలచుకోలేదని, తనను ఆ విషయాలపై ఏమీ అడగవద్దని అన్నారు.