హైదరాబాద్: తాను చేతులెత్తి దండం పెడుతున్నానని తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, యువకులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం అభ్యర్థించారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన బోజ్యా నాయక్ మృతి చాలా బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దని సూచించారు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ అంశంపై వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాలన్నారు. విద్యార్థులు, యువకుల ఆత్మహత్యల వల్ల రాజకీయ పార్టీలు బాగానే ఉంటాయని కానీ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతాయో అర్థం చేసుకోవాలన్నారు.
సూసైడ్ చేసుకునే ముందు తల్లిదండ్రులు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యకు పరిష్కారం చావు అస్సలు కాదన్నారు. తెలంగాణ కోసం ఎవరూ చావొద్దని అన్నారు. పార్టీల తీరు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు కన్న వారి గురించి ఆలోచించాలన్నారు.