చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ బెడద తప్పినట్లేనా?

తన వర్గానికి చెందిన నాయకులను జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పంపిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో వల్లభనేని వంశీని పార్టీ నుంచి తప్పిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వంశీ తనకు పార్టీ నుంచి జారీ అయిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. గతంలో కూడా ఇలాగే జరిగింది. హరికృష్ణ విజయవాడ పర్యటనను కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావుపై వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలకు దిగారు.
అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు దేవినేని ఉమామహేశ్వర రావుకే మద్దతు ఇచ్చారు. దాంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని భావించారు. కానీ, వల్లభనేని వంశీ చంద్రబాబును కలిసిన తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. అయితే, దీంతో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ సెగ తగ్గలేదని అంటున్నారు. వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
శుక్రవారం జరిగిన పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశానికి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ హాజరు కాలేదు. విభేదాలు సమసిపోలేదని, దానివల్లనే హరికృష్ణ సమావేశానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు.
అయితే, ఒక్కసారి తనతో విభేదించి, తిరిగి సామరస్యత కోసం ప్రయత్నాలు చేసినవారిని ఎవరినీ చంద్రబాబు ఎప్పటిలాగా గౌరవించలేదు. ఒక్క దేవేందర్ గౌడ్ విషయంలోనే ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించారు. పార్టీలో సర్దుకుని ఉండడానికి ప్రయత్నించినవారిని ఆయన మరింత విస్మరించడం అలవాటు చేసుకున్నారు. అలాగే, వల్లభనేని వంశీని తిరిగి చంద్రబాబు దగ్గరగా చూసే అవకాశాలు లేవని అంటున్నారు. ఉంటే, తనకు అనుకూలంగా, తాను చెప్పినట్లుగా ఉండాలని, లేదంటే వెళ్లిపోవాలనే పద్ధతిలో వ్యవహరించడమే చంద్రబాబుకు తెలుసుననేది రాజకీయ వర్గాల మాట.












Click it and Unblock the Notifications