సాక్షి ఆస్తుల జప్తుపై సిబిఐకి షాక్: ప్రకటనలపై అపీల్

వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ చేస్తున్న విచారణ కీలక ఘట్టానికి చేరుకోవడం తెలిసిందే. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్ బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభించింది. అలాగే ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతూ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ సంబంధిత రహస్య ఉత్తర్వులను జారీచేసింది. వీటి ఆధారంగా సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. జననీ ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ఆస్తుల జప్తునకు సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.
సిబిఐ పిటిషన్‌లో ఎనిమిది లోపాలున్నాయని సిటీ సివిల్ కోర్టు తెలిపింది. ఆస్తులకు సంబంధించి సరైన కారణాలు వివరించలేదని కోర్టు తెలిపింది. సాక్షి మీడియాకు సంబంధించి హైదరాబాదు వెలుపల కూడా ఆస్తులున్నాయని, అందువల్ల ఇది తమ పరిధిలోకి ఎలా వస్తుందో చెప్పలేదని, ఇది తమ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది. ఆస్తుల వివరాలను కాగితాల మీదనే ఇచ్చారని, డాక్యుమెంట్లను ఇవ్వలేదని కోర్టు చెప్పింది. సాక్షి మీడియా దాఖలు చేసిన కెవియట్ పిటిషన్‌ను కూడా సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. ఇది కూడా తమ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది.
ఇదిలావుంటే, సాక్షి మీడియాకు ప్రకటనల జారీని నిలిపేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే ఇవ్వడంపై సమాచార శాఖ హైకోర్టు డివిజన్ బెంచీకి అపీల్ చేసింది. సాక్షి పత్రికకు, సాక్షి టీవీ చానెల్‌కు వాణిజ్య ప్రకటనలను నిలిపేస్తూ జారీ చేసిన జీవోపై యాజమాన్యం హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద సవాల్ చేశారు. జీవో అమలుపై సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. దీంతో దానిపై సమాచార శాఖ డివిజన్ బెంచీలో అపీల్ చేసింది.
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించరాదని, ఉద్యోగులకు ఇబ్బంది కలిగించకూడదని సాక్షి మీడియా యాజమాన్యం హైకోర్టులో వాదించింది. దీంతో సాక్షి మీడియాకు ప్రకటనలను నిలిపేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. దీనిపై రిట్ పిటిషన్ వేసిన సమాచార శాఖ - సాక్షి మీడియాకు సంబంధించి క్రిమినల్ కుట్ర దాగి ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు జరుగుతోందని, అందువల్ల ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం సరి కాదని వాదించింది.












Click it and Unblock the Notifications