సబితా, గీతారెడ్డి, ఇతర మంత్రుల పరిస్థితి ఏమిటి?

మోపిదేవి అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ చేసిన 26 వివాదాస్పద జీవోలపై సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంత్రులు ఇరకాటంలో పడ్డారు. మోపిదేవి అరెస్టు నేపథ్యంలో కాంగ్రెసు పార్టీలో కలవరం ప్రారంభమైంది.
సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించారు. గీతా రెడ్డికి, పొన్నాల లక్ష్మయ్యకు సిబిఐ నోటీసులు జారీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తమకు నోటీసులు రాలేదని వారిద్దరు చెప్పారు. సిబిఐ అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానని, పిలిస్తే సిబిఐ విచారణకు హాజరవుతానని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఆయన భారీ నీటపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సబితా ఇంద్రా రెడ్డి గనుల శాఖను, గీతా రెడ్డి భారీ పరిశ్రమల శాఖను నిర్వహించారు. మోపిదేవి వెంకటరమణ అరెస్టుతో మంత్రివర్గంలో కలకలం ప్రారంభమైంది. మంత్రివర్గ సభ్యులను ఎందుకు వదిలేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, ఐఎఎస్ అధికారులు వేసిన ప్రశ్నకు మోపిదేవి అరెస్టు ద్వారా సిబిఐ సమాధానం చెప్పినట్లయింది. మంత్రుల అరెస్టు మోపిదేవి అరెస్టుతో ఆగిపోయే పరిస్థితి లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications