4 కాదు, రెండు రోజుల్లో నా అరెస్ట్!: మళ్లీ జగన్ బాంబు

YS Jagan
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఇటీవల నాలుగు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ బుధవారం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులు కాదని, మరో రెండు రోజుల్లోనే తనను అరెస్టు చేస్తారన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై మోపే కుట్ర జరుగుతోందన్నారు. అధికార పార్టీ కాంగ్రెసు సిబిఐ ద్వారా తన కుటుంబాన్ని వేధించి జనం సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. టిడిపి, కాంగ్రెస్‌ల అకృత్యాలను పైనుంచి భగవంతుడు చూస్తున్నాడన్నారు. ఉప ఎన్నికల సమరంలో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కవని జోస్యం చెప్పారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్‌లు తుఫానులో కొట్టుకుపోతాయని, ప్రజలు సంయమనం పాటించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని పారిశ్రామికవేత్తలకు భూములిస్తే.. దాన్ని వైయస్ చేసిన తప్పుగా చూపిస్తూ ఆయనపై నెపం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పొరుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారికి వేలాది ఎకరాల భూములను ఇస్తూ.. అక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని, ఇదే విధానాన్ని వైయస్ అనుసరిస్తే దానిని భూఆక్రమణల నేరంగా పరిగణిస్తున్నారని జగన్ చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో గోల్ఫ్‌కోర్స్‌కు చంద్రబాబు 535 ఎకరాలను కారుచౌకగా ధారాదత్తం చేస్తే ఆ అక్రమాలు సిబిఐకి కనపడవా అని ప్రశ్నించారు. నీతి, నిజాయితీ కోసం నిలబడి తమ ఎమ్మెల్యేలు పదవులను తృణప్రాయంగా త్యాగం చేశారన్నారు.

కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని కుయుక్తులు పన్నినా పైనుంచి దేవుడనే వాడు చూస్తున్నాడని, ఈ నీచ రాజకీయాలను ఆయన క్షమించడని చెప్పారు. జూన్ 12న జరగబోయే 18 స్థానాల్లో ప్రతి అక్క, చెల్లి, అవ్వ, తాత వేసే ఓట్ల ఉప్పెనలో కాంగ్రెస్, టిడిపిలు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం వైయస్ ప్రారంభించిన అన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుతో కుమ్మక్కై తనపై కేసులు వేశారని ఆరోపించారు.

దివంగత నేత వైయస్ ఈ లోకంలో లేడని చూసి ఆయన చేసిన సంస్కరణలను తప్పు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని, సకాలంలో స్కాలర్‌షిప్‌లు కూడా ఇవ్వకుండా లక్షలాది మంది విద్యార్థుల చదువులతో ఆడుకుంటోందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+