జగన్ అరెస్టుపై డిజిపి కామెంట్: భారీ భద్రత, ఉత్కంఠ

ఈ నెల 29వ తేది వరకు కడప జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. ఈ రోజు కడప జిల్లాలో డిజిపి దినేష్ రెడ్డి పర్యటించనున్నారు. అనంతపురం, కడప, కర్నూలు ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. జగన్ విచారణ, అరెస్టు ఊహాగానాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్‌కు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నంలో 100 పోలీసు పికెటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కూడళ్లలో భారీగా భద్రతను ఉంచింది.
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌ను సిబిఐ విచారించనున్న దిల్ కుషా అతిథి గృహం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కడికక్కడ భారీకేడ్లు పెట్టారు. రాజ్ భవనం మీదిగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత ఉంచారు. ధర్నాలు, ర్యాలీలు, ప్రసంగాలను నిషేధించారు.
జగన్‌ను విచారించే దిల్ కుషా అతిథి గృహానికి సాక్షి ఛానల్, పత్రిక పరిధి నుండి ఇద్దరు చొప్పున మాత్రమే రిపోర్టింగ్‌కు అనుమతించారు. విశాఖలో హైఅలర్ట్ ప్రకటించారు. కమిషనరేట్ పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ ఇంటికి వెళుతున్న పలువురు నేతలను పోలీసులు పలుచోట్ల అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డిలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పోలీసులు అడ్డుకున్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీని పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసిపి అకున్ సబర్వాల్ దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. దాదాపు వెయ్యిమంది పోలీసులతో పాటు.. వాటర్ కెనాన్‌లను కూడా ఏర్పాటు చేశారు. లోటస్ పాండ్ నుండి దిల్ కుషా వరకు జగన్ వెళ్లే దారిలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
మరోవైపు జగన్ అరెస్టు ప్రచారం నేపథ్యంలో ఆయన సొంత జిల్లా కడప ప్రజలు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అరెస్టుపై టెన్షన్ నెలకొంది. కాగా జగన్ ఉదయం పదిన్నర గంటలకు తన ఇంటి నుండి సిబిఐ కార్యాలయానికి విచారణ కోసం బయలుదేరి వెళ్లనున్నారు. రోడ్ నెంబర్ 2, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట సర్కిల్, ఖైరతాబాద్‌ల మీదుగా జగన్ సిబిఐ కార్యాలయానికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications