తిరుపతి: సిపిఎం ఫలితాన్ని తారుమారు చేస్తుందా?

సిపిఎం అభ్యర్థి కందారపు మురళి ప్రజాసమస్యల కోసం తాను చేసిన ఉద్యమాలు, తనకున్న పరిచయాలను, బంధుగణాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రజక సామాజికవర్గానికి చెందిన మురళి బిసిలను తనవైపు తిప్పుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తమ పార్టీకి అనుబంధంగా ఉన్న అన్ని వృత్తిదారుల, ప్రజా, యువజన సంఘాలను ఎన్నికల ప్రచారంలోకి దింపారు. వాస్తవానికి సిపిఎంకి మూడు వేలకు మించి ఓట్లు రావని ముందుగా అందరూ భావించారు. అయితే మురళి ప్రణాళికాబద్ధంగా చేస్తున్న విస్తృత ప్రచారం ప్రత్యర్థి శిబిరాలను ఆలోచింపజేస్తోంది.
ముఖ్యంగా టిటిడి కార్మికులకు సంబంధించి తిరుపతి నగరంలో సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో మురళి కీలకపాత్ర పోషించారనే చెప్పాలి.
టిటిడిలో ఉన్న అనేక కార్మిక సంఘాల్లో మురళి గౌరవ అధ్యక్షుడుగానో, గౌరవ సలహాదారుడుగానో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 4 వేల నుండి 5వేల మంది వరకూ కాంట్రాక్టు కార్మికులు సిపిఎం పక్షాన ఉన్నట్లు సర్వేల్లో తేలింది. అయితే వీరందరూ మురళికి ఓట్లు వేస్తారా? లేదా? అనేది పోలింగు తర్వాత గానీ తెలియదు. ఓట్లు వేస్తే మురళికి సుమారుగా 10వేల నుండి 15వేల వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఏ పార్టీకి పడే ఓట్లు సిపిఎం అభ్యర్థి చీల్చడంపై ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.
టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి మాత్రం తమకు సిపిఐ మద్దతు ఉందని, తన గెలుపునకు ఎలాంటి ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు ప్రజల్లో జగన్‌కున్న అపారమైన ప్రేమాభిమానాలు టిటిడి, తుడా చైర్మన్‌గా తాను నగరంలో చేసిన అభివృద్ధి పనులు తనను కచ్చితంగా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరుపతివాసులకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదంటున్నారు. సగటు సామాన్యుడితో కలిసి తిరిగేవాడ్ని అన్న సత్యం నగరంలోని ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ తెలుసని, వారే తనను గెలిపిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బిజెపి అభ్యర్థిగా వాల్మీకి కులానికి చెందిన జల్లి మధుసూదన్ కూడా బరిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటర్లను బ్యాలెట్ వరకూ తీసుకురాగలిగితేనే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా, తెలుగుదేశం పార్టీకి కందాటి శంకర రెడ్డి రాజీనామా చేసి, కాంగ్రెసు పార్టీలో చేరారు. దీనివల్ల కాంగ్రెసుకు కొంత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే, మురళి మూడు పార్టీల్లో ఏ పార్టీకి గండి కొడుతారనేదే ప్రముఖ పాత్ర వహించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications